అరకు వైసీపీ ఎంపీ పార్టీ మారుతున్నారా ?
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ వైసీపీకి ఇప్పుడు గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సవాలుగా మారబోతోంది. ముఖ్యంగా ఎంపీలను బీజేపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను టీడీపీ లాక్కునే ప్రమాదం ఉండటంతో జగన్ ఈ మధ్యే వరుస సమావేశాలు ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించే పనిలో పడ్డారు. అయినా వైసీపీ ఎంపీలను బీజేపీ లాక్కోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గతంలో అరకులో వైసీపీ తరపున గెలిచిన కొత్తపల్లి గీత అనంతరం బీజేపీలోకి ఫిరాయించడంతో, తాజాగా గెలిచిన చెట్టి తనూజారాణి విషయంలోనూ అదే జరగబోతోందనే ప్రచారం ఊపందుకుంటోంది.

ఎస్టీ రిజర్వుడు స్ధానమైన అరకు లోక్ సభ సీటు నుంచి తొలిసారి వైసీపీ టికెట్ దక్కించుకున్న చెట్టి తనూజారాణి బీజేపీ అభ్యర్ధిగా నిలిచిన కొత్తపల్లి గీతపై 50 వేల మెజార్టీతో గెలిచి బయటపడ్డారు. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీతకు స్ధానికంగా ఉన్న పట్టు, కూటమి అభ్యర్ధిగా నిలవడం కలిసొచ్చాయి. అయినా వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకు సాయంతో తనూజ గెలిచారు. అయితే ఆమె కూడా గతంలో కొత్తపల్లి గీత తరహాలోనే బీజేపీలోకి ఫిరాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అరకు ఎంపీ చెట్టి తనూజారాణి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఎక్స్ లో స్పందించారు. ఒకే ఒక్క మాటలో తన పార్టీ మార్పుపై తేల్చిపారేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే మా ప్రయాణం అంటూ ఆమె ట్వీట్ చేశారు. తద్వారా తాను పార్టీ మారబోవడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పినట్లయింది. అయితే తొలిసారి ఎంపీ కావడం, పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో తనూజా రాణి పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం అయితే కొనసాగుతోంది.
ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే మా ప్రయాణం
— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 19, 2024
@ysjagan












Click it and Unblock the Notifications