వైసీపీ ప్రధాన కార్యదర్శి మళ్లీ అరెస్ట్
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యూజర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కఠిన వైఖరిని అవలంభిస్తోంది. అటువంటి ఉదంతాలు పునావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు యూజర్లు అరెస్ట్ అయ్యారు కూడా.
ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మరోసారి అరెస్ట్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ కావడం ఇది రెండోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఆయన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేశారు. ఈ తెల్లవారు జామున ఆయనను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పానికి తరలించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

మొదట ఈ నెల 15వ తేదీన పూడి శ్రీహరి అరెస్ట్ అయ్యారు. ఆయనను విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని కుప్పానికి తరలించారు. 16న కుప్పం కోర్టులో హాజరుపరిచారు. అప్పట్లో ఆయనకు బెయిల్ లభించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రిమాండ్ కు తరలించడానికి నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలను ఆలకించిన అనంతరం ఏపీ హైకోర్టు.. కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
దీనిపై పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం, రిమాండ్ ను తిరస్కరిస్తూ గతంలో కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకుని కుప్పానికి తరలించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications