చంద్రబాబు నివాసం జప్తు - లిస్టులో ఉన్నదెవరు, వాట్ నెక్స్ట్..!!
అమరావతి కరకట్టపై చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఇంటి జప్తుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చంద్రబాబుతో పాటుగా నారాయణ సంబంధీకుల ఆస్తుల జప్తుకు అనుమతి లభించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన సీఐడీ ప్రభుత్వానికి కొన్ని కీలక సిఫార్సులు చేసింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు..నారాయణ..లింగమనేని రమేష్ సహా 14 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసులోనే ఈ మేరకు ఆస్తులు జప్తుకు అనుమతి ఇచ్చారు.
ప్రభుత్వానికి సీఐడీ నివేదిక:అమరావతి భూముల సమీకరణ తో పాటుగా పలు రకాలుగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాల పైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసింది. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ తయారీ, ఆమోదంలో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు విచారించిన సీఐడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.

చంద్రబాబు - నారాయణతో సహా:మాజీ సీఎం చంద్రబాబు, నారాయణ తో పాటుగా మరి కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసారని పేర్కొంది, తమ సొంత లాభం కోసం వాస్తవాలు దాచడం, వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడం చేశారని సీఐడీ నివేదికలో వివరించింది. ఈ క్రమంలో చట్టాలు, ఉత్తర్వులు, సర్క్యులర్లు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాల ఉల్లంఘిన జరిగిందని వివరించింది. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా నేరపూరితమైన కుట్రతో మార్పులకు ఆమోదముద్ర వేశారని పేర్కొంది. లింగమనేని, హెరిటేజ్, ఇతరుల భూములు రాజధాని సిటీ మాస్టర్‌ప్లాన్ కింద సేకరించకుండా, ఇన్నర్ రింగ్ వారి భూములకు మరింత సమీపం నుంచి వెళ్లేలా ప్లాన్‌లు ఆమోదింపజేసుకున్నారని ఆరోపించింది. దీని వల్ల వారి భూముల ధరలు భారీగా పెరిగాయని, రైతులకు, ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంది.
ఆస్తుల అటాచ్ కు అనుమతి:క్విడ్‌ప్రోకో కింద రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు లే అవుట్, జోనల్ డెవల్‌పమెంట్ ప్లాన్స్ ద్వారా లింగమనేనికి భారీ లబ్ధి చేకూరినందున, లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది. ఈ మేర కు హోంశాఖ ముఖ్యకార్యదర్శి సీఐడీకి అనుమతి ఇస్తూ జీవో జారీచేశారు. నారాయణ సంబంధీకుల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారుతోంది.












Click it and Unblock the Notifications