రిజైన్లు వెనక్కి తీసుకోండి, టి నుండి ఫోన్స్: అశోక్‌బాబు
అనంతపురం: అన్ని పార్టీల శాసన సభ్యులు తమ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గురువారం డిమాండ్ చేశారు. కడప జిల్లా రాయచోటిలో జరిగిన రణభేరీలో అశోక్ బాబు మాట్లాడారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వచ్చినప్పుడు దానిని ఓడించేందుకు ఎమ్మెల్యేలు రాజీనామాలను వెనక్కి తీసుకోవాలన్నారు. రాజీనామా చేస్తే సమైక్యవాదానికి అన్యాయం చేసినట్లేనని ఆరోపించారు.
విభజన రాజకీయ స్వార్థం కోసమే అన్నారు. రాజీనామాలు చేయకుండా పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు విభజన ప్రక్రియను ఎలా ఆపుతారో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడే రాజీనామాలు చేయమని తాము అడిగామని, ఎంపీలు రాజీనామా చేయకుండా సభ్యులగా ఉండి అడ్డుకుంటామని చెప్పారని కానీ, ఎలా అడ్డుకుంటారో చెప్పడం లేదని మండిపడ్డారు.

కెబినెట్ నోట్ వస్తే కేంద్రమంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అన్ని పార్టీలు విభజన తీరును తప్పు పడుతున్నాయని చెప్పారు. కేబినెట్ నోట్ వచ్చినప్పుడు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయకుంటే ప్రజలు వారిని క్షమించరన్నారు. విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేయాలన్నారు. పార్టీలు, పదవులు వదులుకునే వారికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నాలుకలు కోస్తామన్న తెలంగాణ నేతల వ్యాఖ్యల పైన సీమాంధ్ర నేతలు స్పందించాలన్నారు. తెలంగాణ ప్రాంతంలోను చాలామంది సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని చెప్పారు. తనకు, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్ తదితర జిల్లాల నుండి సమైక్యాంధ్ర సభలు పెట్టాలని ఫోన్లు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా సమైక్యవాదాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
హైదరాబాద్‌ను యుటి చేయమని అడగం
రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని తాము అడగటం లేదన్నారు. హైదరాబాదును ఉమ్మడి రాజధాని లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్యలు తీరవన్నారు. హైదరాబాదును ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగానే ఉంచాలని చెప్పారు.












Click it and Unblock the Notifications