ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీ
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లగేజీ నిర్వహణ వ్యవస్థలో తీసుకురానున్న మార్పులపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ నూతన విధానం గురించి ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యాధునిక బీఎల్ఈ 5.1 టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన విధానం ఇది.
ఈ విధానంలో భక్తుల లగేజీని స్వీకరించినప్పటి నుంచి తిరిగి అందజేసే వరకు ప్రతి దశను సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించే విధానాన్ని జీఎంఆర్ ప్రతినిధులు క్షుణ్నంగా వివరించారు. అలిపిరి వద్ద భక్తుల లగేజీని స్వీకరించడం, ట్యాగ్‌ను అనుసంధానం చేయడం, వాహనాల ద్వారా తిరుమలకు తరలించడం, జీఎన్‌సీ వద్ద లగేజీని నిల్వ చేయడం, భక్తులు లగేజీని తిరిగి తీసుకునే వరకు మొత్తం ప్రక్రియను ఎండ్-టు-ఎండ్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

రోజుకు సుమారు 12,000 బ్యాగులు, రద్దీ సమయాల్లో గంటకు సుమారు 1,800 బ్యాగులను నిర్వహించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తోన్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు తెలియజేశారు. ప్రతి లగేజీకి బీఎల్ఈ ట్యాగ్‌ను అనుసంధానం చేయడం ద్వారా అది ఏ ప్రాంతంలో ఉందో ట్రాక్ చేయడానికి వీలు కలుగుతుంది. భక్తులు లగేజీని తిరిగి పొందే సమయంలో ఏర్పడే క్యూను తగ్గించడానికి ముందస్తు రిక్వెస్ట్ చేసే విధానాన్ని వివరించారు.
జీఎన్‌సీకి సుమారు 100 మీటర్ల పరిధిలో ఉన్నప్పుడు కియోస్క్ లేదా మొబైల్ యాప్ ద్వారా లగేజీ కోసం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేరుగా కౌంటర్ వద్ద కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలిపిరి నుంచి జీఎన్‌సీ వరకు లగేజీ తరలింపును కూడా డిజిటల్ మానిఫెస్ట్, జీపీఎస్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించే విధానాన్ని జీఎంఆర్ ప్రతినిధులు ప్రతిపాదించారు.
లగేజీ నిర్వహణకు సంబంధించిన ఆక్యుపెన్సీ, భక్తుల రాకపోకలు, రద్దీ, సేవల స్థితిగతులు.. తదితర అంశాలను ఒకే కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. ఈ నూతన లగేజీ నిర్వహణ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున.. ఏ ఒక్క భక్తుడు కూడా లగేజీ విషయంలో గందరగోళానికి గానీ, దాన్ని తిరిగి పొందే విషయంలో తీవ్ర జాప్యానికి గానీ గురి కాకూడదని ఆయన అన్నారు.














Click it and Unblock the Notifications