సహజమే: 'సాక్షి భూఆక్రమణ'పై అశోక్, అప్పుడే దోపిడీకి ప్లాన్: బొత్స
హైదరాబాద్: అమరావతిలో భూఆక్రమణ అంటూ వైసిపి అధినేత జగన్‌కు చెందిన పత్రిక సాక్షిలో వచ్చిన ఆరోపణల పైన కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు స్పందించారు. అమరావతిలో భూఆక్రమణలపై ఆరోపణలు సహజమేనన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారు ఉంటారని అభిప్రాయపడ్డారు.
అసైన్డు భూముల పేర్లు మార్పు, బదలాయింపులు చెల్లవని చెప్పారు. తాము వినూత్న పద్ధతిలో 33వేల ఎకరాలు సేకరించామని చెప్పారు. వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి తెలంగాణ సీఎం కెసిఆర్ రాసిన లేఖ పరిశీలనలో ఉందని చెప్పారు.
పౌరవిమానయాన శాఖలో మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పాత విమానాశ్రయాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. విమానాశ్రయాలకు నగరాల పేర్లు, టెర్మినళ్లకు మహనీయుల పేర్లు కొనసాగిస్తామని చెప్పారు. విశాఖ భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం అనుమతి లభించిందన్నారు.

రియల్ ఎస్టేట్ దందా: బొత్స
రాజధాని పేరితో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని వైసిపి నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అసైన్డు భూముల పేర్లతో బినామీలకు రాయించుకున్నారన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కేవలం రూ.100 కోట్లు ఇచ్చినా మాట్లాడలేదన్నారు.
కేంద్రంలో భాగస్వామి అయినందుకు టిడిపికి సిగ్గు అనిపించడం లేదా అన్నారు. రాజధాని ఒక్కరిది కాదని, ప్రజలందరిదీ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఓ అవినీతి ప్రాజెక్టు అన్నారు. కాసులకు కక్కుర్తిపడి పట్టిసీమను చేపట్టారన్నారు. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు రావన్నారు.
ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎన్నికలు ముగియగానే దోపిడీకి ప్లాన్ వేశారని ఆరోపించారు. టిడిపి నేతలు ఇఫ్పుడు నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. నాడు హైటెక్ సిటీ అంటూ బినామీలకు ప్రయోజనం కలిగించారన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, కానీ రాజధాని పేరిట జరుగుతున్న అవినీతికి తాము వ్యతిరేకమన్నారు.
రాజధాని ప్రకటనకు 2 నెలల ముందు ఎలా కొన్నారు
తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో భూదురాక్రమణ పైన విచారణ జరిపించాలన్నారు. రాజధాని ప్రకటనకు రెండు నెలల ముందు భూములు ఎందుకు కొన్నారో చెప్పాలన్నారు. బినామీ భూములున్న చోట గ్రీన్ ఫీల్డ్ కాలేదన్నారు. పేదల భూములు ఉన్నచోట గ్రీన్ ఫీల్డ్ ప్రకటించారన్నారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి దర్యాఫ్తు జరిపించాలన్నారు.












Click it and Unblock the Notifications