'తెలుగువారి సంకల్పం గొప్పది ఏదైనా సాధించగలరు', 'చంద్రన్న' దసరా కానుక
అమరావతి: తెలుగు వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సభా ప్రాంగణాన్ని సోమవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రపంచ నగరాలకే మార్గదర్శనం అవుతుందని, కొత్తగా నిర్మించనున్న నగరాన్ని హరితనగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు.

తెలుగువారి సంకల్సం చాలా గొప్పదని, వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. నూతన రాజధాని అమరావతికి కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.
స్వరాజ్ మైదాన్‌లో దేశవ్యాప్తంగా సేకరించిన నదీజలాలు
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పవిత్ర నదీ జలాలను విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో ఉంచారు. రాజధాని అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా సాగాలని మానస సరోవర్, అలహాబాద్, త్రివేణి సంగమం, బ్రహ్మపుత్ర, యమునానది తదితర ప్రాంతాల నుంచి జలాలను సేకరించారు.
ఈ పుణ్య నదీజలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. కాగా, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణం నుంచి వెళ్లే వాహనాలను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనున్నారు. వివిధ ప్రాంతాల మట్టి, పవిత్ర జలాలు శంకుస్థాపన ప్రాంతానికి తరలించనున్నారు. శంకుస్థాపన తర్వాత సీఆర్డీఏ ప్రాంతంలో మట్టి, నీటిని అధికారులు వెదజల్లనున్నారు.
పౌరసరఫరాల శాఖ కూలీలకు ‘చంద్రన్న' దసరా కానుక
పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కూలీలకు సీఎం చంద్రబాబు నాయుడు దసరా కానుక ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు, రెండు జతల బట్టలు, కేజీ స్వీట్లు పంపిణీ చేశారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చంద్రన్న ప్రకటించిన దసరా కానుకను మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, కిమిడి మృణాళిని చేతుల మీదుగా కూలీలకు అందజేశారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. తమకు దసరా కానుకను ప్రకటించిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications