'1 నుండి విశాఖ నుండి విమానాలు', సునీల్ వివరణ
విశాఖ: హుధుద్ తుఫాను రోజు విశాఖ విమానాశ్రయంలోనే ఉండి నష్టాన్ని తగ్గించిన సిబ్బందిని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానాశ్రయంలో ప్రాణనష్టం జరగలదేన్నారు. విమానాశ్రయ సిబ్బంది అంకితభావాన్ని అశోక్ కొనియాడారు.
విమానాశ్రయంలో కీలక వ్యవస్థలు దెబ్బతినలేదని, ఎయిర్ పోర్టులోని కీలక పరికరాలను సిబ్బంది ధైర్యంగా కాపాడారన్నారు. రేపటి నుండి విశాఖలో విమానరాకపోకలు ప్రారంభమవుతాయన్నారు. నవంబరు 1 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. విమానాశ్రయ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి పునరుద్ధరించారన్నారు. ఏటీసీ క్షేమంగా ఉందని, రాడార్ వ్యవస్థ స్వల్పంగా దెబ్బతిన్నదని చెప్పారు.

భీకర తపాను నుంచి విశాఖ విమానాశ్రయాన్ని సిబ్బందే కాపాడారంటూ కొనియాడారు. సిబ్బంది అప్రమత్తత కారణంగానే విమానాశ్రయంలో ప్రాణనష్టం సంభవించలేదన్నారు. విమానాశ్రయంలోని కీలక వ్యవస్థలు దెబ్బతినలేదని చెప్పారు. విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మూణ్ణెళ్లు పడుతుందన్నారు. మరోవైపు, ఎల్ఎన్ పేట తహసీల్దారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆయనను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
కాగా, భారతీ ఎయిర్ టెల్ సీఈవో సునీల్ మిట్టల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విశాఖలో కలుసుకున్న విషయం తెలిసిందే. సెల్‌ఫోన్ ఆపరేటర్లతో సమీక్ష సమయంలో వచ్చిన ఆయనకు ఇంకా పునరుద్ధరణ కాని ఎయిర్ టెల్ కమ్యూనికేషన్ గురించి బాబు వివరించారు.
అనంతరం మిట్టల్ మాట్లాడుతూ.. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే పనుల్లో వెనుకపడ్డామన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఎయిర్ టెల్ నెట్వర్క్ పునరుద్ధరణలో సిబ్బంది 48 గంటల పాటు శ్రమించారన్నారు. ఎల్లుండిలోగా అన్ని ప్రాంతాల్లో తమ నెట్వర్క్ సేవలు వస్తాయని, సాయంత్రానికి మరో ఐదు ప్రాంతాల్లో ఎయిర్ టెల్ సేవలు పునరుద్ధరిస్తామని మిట్టల్ తెలిపారు.
ఇంకా ఆరు ప్రాంతాల్లో యాంటెనాలను అమర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అంచనాలను అందుకోలేకపోయామన్న మిట్టల్, ప్రభుత్వం సహాయ చర్యలు అభినందనీయమన్నారు. ఎయిర్ టెల్ నెట్ వర్క్ పునరుద్ధరణలో సిబ్బంది 48 గంటల పాటు శ్రమించారని చంద్రబాబుకు వివరించారు. కాగా, చంద్రబాబు సెల్ ఫోన్ ఆపరేటర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. సమావేశానికి రాని సెల్ ఫోన్ ఆపరేటర్ల ఇంటికి పోలీసులను పంపించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications