బాబు మాటలకు నొచ్చుకున్న అశోక్‌గజపతి: రాజీనామాకు సిద్ధం, బుజ్జగింపు
కృష్ణా: తెలుగుదేశం అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలతో నొచ్చుకున్న అశోక్‌గజపతిరాజు రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు ఆయనను బుజ్జగించారు.
విజయవాడలో శుక్రవారం జరిగిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగంగా జరగడం లేదని అన్నారు.
కేంద్ర విమానయాన శాఖ నుంచి కేటాయించిన నిధుల విడుదల కూడా ఆలస్యమవుతోందని చెప్పారు. దీంతో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. తాను అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని బదులిచ్చారు. ‘మీది స్వతంత్ర శాఖ. రాష్ట్రానికి రావలసిన నిధులను మాట్లాడి తెచ్చుకోవాలి కదా' అని బాబు అన్నారు.

కాగా, గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ పనులను వేగంగా చేస్తున్నామని, భోగాపురం విమానాశ్రయం రావడానికి కూడా తాను కృషి చేశానని అశోక్ వివరించారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూసేకరణలో జాప్యం తప్ప వేరే కారణం లేదని వివరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల విషయంలో మనం ఏమీ చేయలేకపోతున్నామని ఒకరిద్దరు ఎంపీలు వ్యాఖ్యానించారు.
దీంతో, పేరుకు తనది స్వతంత్ర శాఖే అయినా ప్రతి ఫైలు ప్రధాని పేషీకి వెళ్లాల్సిందేనని మంత్రి అశోక్ తెలిపినట్లు సమాచారం. శాఖాపరంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. ప్రధాని పేషీలో అధికారులు అనేక కొర్రీలు వేస్తుంటారని, దీని వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ‘పనులు వేగంగా అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయి. చేయాల్సిందంతా చేస్తే ప్రజల నుంచి విమర్శలు రావు కదా' అని బాబు వ్యాఖ్యానించారు.
బాబు వ్యాఖ్యలతో నొచ్చుకున్న అశోక్ గజపతి రాజు స్పందిస్తూ.. ‘మీరు నా పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే తొలగించండి సార్. మీకు ఇబ్బంది అనుకుంటే రేపు తొలి గంటలో రాజీనామా చేసి రాష్ట్రపతికి అందజేస్తా' అని వ్యాఖ్యానించడంతో ఎంపీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో అశోక్ గజపతి రాజు నొచ్చుకున్నట్లు గ్రహించిన చంద్రబాబు.. వాతావరణాన్ని చల్లబర్చేందుకు ప్రయత్నించారు. ఆయనను బుజ్జగించారు.












Click it and Unblock the Notifications