మాన్సాస్ ట్రస్ట్ వివాదం... హైకోర్టు తీర్పుపై అశోక్ గజపతిరాజు రియాక్షన్... సంచయితకు చురకలు
మాన్సాస్ ట్రస్ట్ వారసత్వ బాధ్యతల విషయంలో జరుగుతున్న యుద్ధానికి హైకోర్టు తెరదించిన సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజునే ట్రస్ట్ ఛైర్మన్‌గా కొనసాగించాలని కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. తాజా తీర్పుపై అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు.
మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందని అశోక్ గజపతిరాజు విమర్శించారు.మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ బాధ్యతల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించి ట్రస్టు ప్రతిష్ఠను దెబ్బతీశారని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచయిత చేసింది తక్కువ... హడావుడి ఎక్కువ అని చురకలంటించారు. కేవలం ఆర్భాటాల కోసం ట్రస్టు సొమ్ముతో రూ.1కోటి పెట్టి కార్లు కొనుగోలు చేశారని అన్నారు.హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ట్రస్టు ఈవో ఇంతవరకూ తనను కలవలేదన్నారు.

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ బాధ్యతల విషయంలో గజపతుల వంశంలో వారసత్వ యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. 1958 నవంబర్ 12న ఏర్పాటైన ఈ ట్రస్టుకు మొదట్లో పీవీజీ రాజు వ్యవస్థాపక ఛైర్మన్‌గా, ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు.1994లో పీవీజీ రాజు మరణానంతరం ఆనంద గజపతి రాజు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆనంద గజపతిరాజు మరణానంతరం అశోక్ గజపతిరాజు ఛైర్మన్ అయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను నియమించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని అశోక్ గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్‌లో అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.దీంతో సంచయిత స్థానంలో మళ్లీ అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు.ఇదే క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సంచయిత హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పునే సమర్థించింది. ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజునే నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో సంచయితతో పాటు,ఆమెను ఆ పదవిలో నియమించిన జగన్ సర్కార్‌కు షాక్ తగిలినట్లయింది. తాజా హైకోర్టు తీర్పుపై సంచయిత,జగన్ సర్కార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా,మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో దాదాపు 12 విద్యా సంస్థలు ఉన్నాయి.ఇందులో 1,800 మంది ఉద్యోగులు, 15,000 మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ ట్రస్టు పేరిట దాదాపు 14,800 ఎకరాల భూమి ఉంది.ఇవిగాక 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ట్రస్టు ఏర్పాటైన నాటి నుంచి గజపతుల వంశస్తులే దీనికి ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications