అమరావతికి మరో బిగ్ న్యూస్-8 వేల కోట్లకు ఓకే చెప్పిన అంతర్జాతీయ బ్యాంక్..!
ఏపీ రాజధాని అమరావతికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ శుభవార్తలే అందుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి గతంలో నిలిపేసిన టెండర్లు మళ్లీ పిలిచి పనుల నిర్మాణం ప్రారంభిస్తోంది. ఇందుకోసం అవసరమైన వేల కోట్ల నిధుల కోసం అంతర్జాతీయ బ్యాంకుల సాయం కోరింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ కూడా ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలపగా.. ఇప్పుడు ఏడీబీ కూడా అడిగిన మేరకు రుణం ఇచ్చేందుకు సిద్దమైంది.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.8 వేల కోట్ల రుణం కావాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకును కోరింది. దీనిపై తాజాగా ఢిల్లీలో జరిగిన భేటీలో ప్రపంచ బ్యాంకు, ఇతర రుణాలిచ్చే సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించిన ఏడీబీ అధికారులు.. ఇవాళ మనీలాలో జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి ప్రక్రియ ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది.
వచ్చే నెలలో ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం జరగనుంది. ఇందులో ఆసియా అభివృద్ధి బ్యాంక్ కూడా సంతకాలు చేయనుంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిసి అమరావతి రాజధానికి రూ.13500 కోట్లు రుణంగా ఇవ్వబోతున్నాయి. అందుకే ఇరు బ్యాంకులు కలిసి ఒప్పందంపై సంతకాలు చేస్తారు. మరో రూ.1500 కోట్లు కేంద్రం ఇస్తుంది. దీంతో గత కేంద్ర బడ్జెట్ లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన రూ.15 వేల కోట్లు అమరావతికి సమకూరినట్లే. ఐదేళ్ల తర్వాత ఈ రుణాల చెల్లింపు ప్రారంభమవుతుంది. ఆలోపు రాజధాని పూర్తి చేయాలి. అయితే ఆరునెలలకో వాయిదా చొప్పన 23 ఏళ్లలో ఈ రుణం క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications