విభజన: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ నుండి ఆరా

మరోవైపు డిసెంబర్ రెండోవారం ఆరంభంలో అసెంబ్లీ భేటీ ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. అప్పుడే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి భవన్ నుంచి అసెంబ్లీ కార్యదర్శికి నోట్ వస్తుందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం శాసనసభ పరిసరాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు.
పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత అసెంబ్లీ సిబ్బంది ఒక పాము పిల్లను పట్టుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో తనిఖీ పూర్తయిన తర్వాత సందర్శకులు, మీడియా లాంజ్‌లను స్పీకర్ పరిశీలించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో అసెంబ్లీ కార్యాదర్శి రాజాసదారాంతో సమావేశాల ఏర్పాటు గురించి, భ ద్రతా చర్యలపై సమీక్షించారు. సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా అధికారులు, మీడియా ప్రతినిధులకు జారీ చేసిన పాసులు తదితర వివరాలను తెలుసుకున్నారు. మొత్తం 943 మందికి పాసులు జారీ చేసినట్లు రాజాసదారాం వివరించారు.
రాష్ట్ర విభజనపై తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయంటూ స్పీకర్ మనోహర్ వద్ద కొందరు ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు.
విభజన అంశంపై చర్చించేందుకు వీలుగా శాసనసభా సమావేశాలను అవసరమైతే అర్ధరాత్రి వరకూ నిర్వహించాలన్న యోచనలో శాసనసభా వర్గాలు ఉన్నాయి. సహజంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ శాసనసభా సమావేశాలు జరుగుతాయి. అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చే కాలపరిమితిని అనుసరించి ఈ సమయంపై శాసనసభా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ అవసరమైతే అర్ధరాత్రి వరకూ శాసనసభ్యుల అభిప్రాయాలను సేకరించాలన్న యోచనలో అసెంబ్లీ వర్గాలు ఉన్నాయట.












Click it and Unblock the Notifications