రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అభ్యర్దుల ఖరారు పైన పార్టీలు ఫోకస్ చేసాయి. ఈ సమయంలోనే ప్రస్తుత ప్రభుత్వ హాయంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల పైన చర్యల దిశగా స్పీకర్ అడుగులు వేస్తున్నారు. చివరి అవకాశంగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పడు స్పీకర్ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది.
వైసీపీ నుంచి నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. తుది విచారణగా తేల్చి చెప్పటంతో ఈ సారి విచారణ పైన ఆసక్తి కనిపిస్తోంది. స్పీకర్ ఆదేశాల నిమిత్తం గతంలో పలువురు రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దీంతో, ఈ నోటీసుల పైన రెబల్ ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు.

హాజరు కానీ పక్షంలో ఇప్పటి వరకు తాను విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ లకు సైతం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలో విచారణకు హాజరయ్యే విషయమై ఆ నలుగురు నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విచారణ తరువాత మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ తీసుకొనే నిర్ణయాలు ఏంటనేది ఈ నెల 19న స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications