రేపో మాపో చంద్రబాబుకు నోటీసులు?: స్టీఫెన్ సన్ ఫోన్ రికార్డింగ్ ఆప్షన్ వల్లనే...
హైదరాబాద్: స్టీఫెన్ ఫోన్‌లో ఉన్న రికార్డింగ్ ఆప్షన్ వల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సంభాషణలు రికార్డయ్యాయని తెలంగాణ పోలీసులు సమర్థించుకుంటున్నారు. చంద్రబాబు ఫోన్ సంభాషణలు ముందే రికార్డ్ చేసి, ఏసీబీ స్వాధీనంలో ఉన్న స్టీఫెన్ ఫోన్ మెమొరీలోకి పంపించి ఉండొచ్చని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తమని తాము సమర్థించుకున్నారు.
రేవంత్‌రెడ్డి కాల్‌డేటాను ఏసీబీ వెలికి తీసింది. అరెస్టుకు ముందు 4 రోజులు.. తర్వాత 3 రోజుల కాల్‌డేటాను ఏసీబీ పరిశీలన చేసింది. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డిని, ఇతర నిందితులను ఎసిబి అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఫోన్ సంభాషణల్లో 50 నుంచి 75 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా ఫోన్‌లకు వచ్చిన కాల్స్‌పై అధికారులు ఆరా తీశారు. 20 మంది కాల్‌డేటాను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.

చంద్రబాబుకు ఎసిబి అధికారులు రేపో మాపో నోటీసులు జారీ చేయవచ్చునని అంటున్నారు. రేవంత్ రెడ్డి విచారణలో తేలిన విషయాలను, తాజా ఆడియో టేప్ ఆధారాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు.
రేవంత్‌రెడ్డి అనుమానాస్పద సంచారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు రేవంత్ వారం రోజుల్లో 3 సార్లు గన్‌మెన్స్ లేకుండా బయటకెళ్లారు. ఈ క్రమంలో గన్‌మెన్స్ వాంగ్మూలాన్ని అధికారులు సేకరించారు. హవాలా ద్వారా రేవంత్ రెడ్డికి 50 లక్షల రూపాయలు చేరినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఖాతా నుంచి ఆ డబ్బులు డ్రా చేసినట్లు చెబుతున్నారు.
రెండు రోజుల్లో రేవంత్‌రెడ్డి నుంచి ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలను సేకరించారు. ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది. ఈ రెండు రోజుల్లో రేవంత్ నుంచి ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications