కెసిఆర్‌తో భేటీ: తెలంగాణలో ఆసీస్ కంపెనీ యూనిట్లు
హైదరాబాద్: తెలంగాణలోని కరీంనగర్, సిద్ధిపేట ప్రాంతాల్లో రూ. 1000 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో ముడి ఇనుము, పెల్లెట్స్ తయారీ యూనిట్లను స్థాపించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఎన్ఎస్ఎల్ కన్సాలిడేటెడ్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ డైరెక్టర్ సియాన్ ఫ్రీమాన్ బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. తెలంగాణలో ముడి ఇనుమును అభివృద్ధి చేసే విషయంపై చర్చించారు.
తెలంగాణలో లభించే ముడి ఇనుము సాంద్రత 25 నుంచి 30 శాతం మాత్రమే ఉందని, దీన్ని 65 శాతానికి పెంచే ముడి ఇనుము ఉక్కు పరిశ్రమలకు ఉపయోగించే పెల్లెట్స్‌గా మారుస్తామని కంపెనీ డైరెక్టర్ అన్నారు. ఇప్పటికే కరీంనగర్, సిద్ధిపేట ప్రాంతాల్లో దాదాపు 200 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉన్నట్లు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది.
కరీంనగర్, సిద్ధిపేట ప్రాంతాల్లో పెల్లెట్స్ తయారీ యూనిట్లను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఫ్రీమాన్ చెప్పారు. మొదటి దశలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో యూనిట్ ప్రారంభిస్తామని, దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం కావాలని అన్నారు దీనికి కెసిఆర్ సానుకూలంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

తెలంగాణలో వనరులను సద్వినియోగం చేసుకోవడం, యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పారిశ్రామికీకరణ ఉంటుందని కెసిఆర్ చెప్పారు. పారిశ్రామిక విధానం పారదర్శకంగా, సరళంగా ఉంటుందని చెప్పారు. స్నేహపూర్వక పారిశ్రామిక సంబంధాన్ని పాటిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు మాదిరిగానే చాలా చోట్ల ఇనుప ఖనిజం ఉందని, దాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలు పెట్టడం వల్ల పారిశ్రామికవేత్తలకు, తెలంగాణ యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా కంపెనీ మొదటి దశలో తమ యూనిట్‌మను కరీంనగర్ జిల్లాలో ప్రారంభిస్తుంది. రెండవ దశలో సిద్ధిపేట ప్రాంతంలో యూనిట్‌ను ప్రారంభిస్తుంది. ఈ రెండు యూనిట్లలో దాదాపు వేయి మందికి ఉపాధి లభిస్తుంది. రెండు యూనిట్లలో పెల్లెట్స్ తయారీ ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయి ఉక్కు ఉత్పత్తి కర్మాగారా్ని ప్రారంభిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications