బెదిరించి బాలికపై ఆటోడ్రైవర్ రేప్: 5నెలల గర్భిణి
అమరావతి: తల్లితో కలిసి ఓ ఇంట్లో అద్దెకుంటున్న బాలికను బెదిరించి ఆరు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
ఏలూరులో కుమార్తె(13)తో కలిసి తల్లి ఓ ఇంట్లో అద్దెకుంటోంది. ప్రతిరోజూ తెల్లవారుజామున తల్లి నాలుగు గంటలకు ముగ్గు అమ్మేందుకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వస్తుంది.
బాలిక తన ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.

బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న విషయాన్ని గమనించిన ఇంటి యజమాని మనవడు, ఆటోడ్రైవర్ పాలాపురి గణేష్(22) ఆమెను బెదిరించి ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో విషయం ఇన్ని రోజులు వెలుగులోకి రాలేదు.
అయితే, గత కొన్ని రోజులుగా బాలిక బాధపడుతుండటంతో గమనించిన తల్లి, కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఈ అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక ప్రస్తుతం ఐదో నెల గర్భిణి అనే విషయాన్ని వైద్యులు చెప్పడంతో తల్లి ఒక్కసారిగా అవాక్కయింది.
దీంతో వెంటనే ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 244/2015 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications