ఆ రాష్ట్రాల్లోనూ మూడు రాజధానులు - కోర్టు తీర్పును గౌరవిస్తాం : పురందేశ్వరి చెప్పాలి - అవంతి..!!
మూడు రాజధానులపై బీజేపీది రెండు నాల్కల ధోరణని మంత్రి అవంతి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరిపై తమకు గౌరవం ఉందని చెబుతూనే..ఏపీ అప్పుల గురించి పురందేశ్వరి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కానీ, తాము అడిగే ప్రశ్నలకు పురందేశ్వరి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు. కేంద్రం అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని నడుపుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రాలతో సమానంగా బీజేపీయేతర రాష్ట్రాలను గౌరవించాలని సూచించారు.

ఆ రాష్ట్రాల్లోనూ మూడు రాజధానుల పై
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అవంతి సెటైర్లు వేసారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని కామెంట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తాము చిత్తశుద్దితో ఉన్నామన్నారు. సమస్యను కేంద్రం దగ్గరకు తీసుకుని వెళ్తామన్న పవన్.. ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా మూడు రాజధానులు గురించి ఆలోచిస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు.

న్యాయస్థానం.. ప్రజా తీర్పు రెండూ కీలకమే
అదే, సమయంలో ప్రజా న్యాయస్థానం తీర్పు కీలకమని వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు మాకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని.. జనం ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత మామీద ఉందన్నారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే అభ్యంతరాలు ఎందుకో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు.

భవిష్యత్ కోసమే ఈ నిర్ణయాలు
భవిష్యత్తులో ప్రాంతీయ వేర్పాటు తత్వం వస్తే మళ్లీ నష్టపోకూడదనే ఉద్దేశంతోనే వికేంద్రీకరణకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం కావడం వాస్తవమేనని తెలిపారు. ఈ ఏడాదిలోగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి అవంతి ప్రకటించారు. రేపు జనసేన ఆవిర్భావ సభ జరగనుండటంలో స్టీల్ ప్లాంట్ అంశంతో పాటుగా అవంతి తాజాగా చేసిన వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications