Ayesha Meera: ఆయేషా మీరా కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశం-27న అంత్యక్రియలు..!
విజయవాడలో 19 ఏళ్ల క్రితం రేప్, హత్యకు గురైన బీ ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా (ayesha meera) కేసు ఇప్పటికీ తేలలేదు. పైగా రోజుకో ట్విస్ట్ తప్పడం లేదు. ఆమెను రేప్ చేసి హత్య చేసిన వారెవరూ ఇప్పటికీ సీబీఐ కూడా తేల్చలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు సీబీఐకి విజయవాడలోని సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి ఆయేషా మీరాకు అంత్యక్రియలు జరగబోతున్నాయి.
2007లో జరిగిన ఆయేషా మీరా హత్య తర్వాత పోలీసులు సత్యంబాబు సహా పలువురు అమాయకుల్ని నిందితులుగా చేర్చి ఈ కేసును క్లోజ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన తప్పుడు కేసుల్ని కోర్టులు కొట్టేయడంతో ఆ అమాయకులకు ఊరట లభించింది. అయితే ఇప్పటికీ ఆయేషా మీరా కుటుంబం మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన సీబీఐ.. ఆయేషా మీరా సమాధిని తవ్వి అవశేషాల్ని సేకరించింది.

వీటిని కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ నివేదికను అందజేసింది. అయితే ఇందులో నిందితుల ప్రస్తావన ఉందో లేదో ఇంకా తేలలేదు. అయితే న్యాయప్రక్రియ పూర్తి కావడంతో సీబీఐ సేకరించిన తమ కుమార్తె అవశేషాల్ని తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లితండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ పాషా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. సీబీఐని ఆమె అవశేషాల్ని తిరిగి కుటుంబానికి అప్పగించేలా ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 27న మరోమారు కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ తల్లితండ్రులు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications