ఆయేషా మీరా తల్లితండ్రుల షాక్..! సీబీఐ కోర్టు నోటీసుల తిరస్కరణ..!
విజయవాడ ఇబ్రహింపట్నంలోని బాలికల హాస్టల్లో 18 ఏళ్ల క్రితం రేప్, హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై ఇప్పటికే పలు మార్లు పోలీసులు, సిట్, సీబీఐ దర్యాప్తు జరిపాయి. అయితే తాజాగా విజయవాడ కోర్టు గతంలో ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సత్యంబాబుపై సెక్షన్ల నమోదు విషయంలో అభిప్రాయం చెప్పేందుకు హాజరు కావాలని ఆయేషా మీరా తల్లితండ్రులకు తాజాగా నోటీసులు పంపింది. దీనిపై వారు స్పందించారు.
సత్యంబాబుపై 376, 302 సెక్షన్ల నమోదు విషయంలో తమ అభిప్రాయం చెప్పేందుకు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు పంపిన నోటీసుల్ని తిరస్కరిస్తున్నట్లు ఆయేషా మీరా తల్లితండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా తెలిపారు. విచారణ పూర్తయ్యిందని నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సీబీఐ అందించిందని వారు గుర్తుచేశారు. అటువంటప్పుడు మళ్లీ సత్యంబాబు పై కేసు నమోదుకు తమ అభ్యంతరాలు అడగడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

అయేషామీరా హత్య కేసులో న్యాయం జరగడం లేదని తల్లితండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా వాపోయారు. 18 ఏళ్లు పూర్తైనా అసలు కారణం బయటకు రావడం లేదన్నారు. సత్యంబాబు ఈ కేసులో నిందితుడు కాదని మరోసారి గుర్తుచేశారు. పోలీసులు, సిట్, ఇప్పుడు సీబీఐ కూడా తమకు న్యాయం చేయలేకపోయిందన్నారు. సీబీఐ విచారణ నివేదిక ఇంకా తమకు ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు.

అయ్యేషా మీరా హత్య కేసులో న్యాయం కోసం తమ ఆచారాలను కూడా లెక్కచెయ్యలేదని వారు గుర్తుచేశారు. ఎవరో ఒకరిని ఇరికించి చేతులు దులుపుకుంటామంటే ఎలా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ నివేదిక తమకు ఇస్తే అప్పుడు మా అభ్యంతరాలు చెబుతామని ఆయేషా మీరా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ నివేదిక ఇవ్వనంతవరకూ కోర్టుకు హాజరై తమ అభిప్రాయం చెప్పేది లేదంటున్నారు.












Click it and Unblock the Notifications