వైజాగ్ గోవాలా ఎందుకు డెవలప్ కావట్లేదంటే ? స్పీకర్ షాకింగ్ రీజన్..!
ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖపట్నానికి టూరిజం హబ్ గా కూడా పేరుంది. తాజాగా ఇక్కడ రెండు రోజుల పాటు సీఐఐ పెట్టుబడుల సదస్సు కూడా జరిగింది. అంతకు ముందే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చింది. అయితే ఇంత వేగంగా విశాఖలో అభివృద్ది జరుగుతుండటానికి కారణం ఇక్కడి బీచ్, పర్యాటక ప్రాంతాలే. కానీ దేశంలో పర్యాటకంగా ఎంతో ముందున్న గోవా తరహాలో మాత్రం విశాఖ అభివృద్ది చెందడం లేదనే విమర్శలున్నాయి.
అయితే గోవా తరహాలో విశాఖపట్నం టూరిజంలో అభివృద్ధి చెందకపోవడానికి వెనుక కీలక కారణం ఉందంటున్నారు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. గోవాలో పర్యాటకులపై ఆంక్షలు లేవని, విశాఖలో మాత్రం ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అందుకే ఇక్కడ టూరిజం డెవలప్ అవడం లేదన్నారు. ఎక్కడ నుంచో భార్యాభర్తలు బీచ్‌కి వచ్చి టీ తాగుతారా? అని ఆయన ప్రశ్నించారు. 'భర్త రెండు పెగ్లు వేయాలి... భార్య ఐస్‌క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలి' అంటూ స్పీకర్ అయ్యనపాత్రుడు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఈ మధ్యే గవర్నర్ అశోక్ గజపతిరాజును కలవడానికి గోవా వెళ్లానని అయన్నపాత్రుడు తెలిపారు. మొత్తం టూరిస్టులంతా అక్కడే ఉన్నారన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారన్నారు. విశాఖలో టూరిజం అభివృద్ది చెందాలని అందరికీ కోరిక ఉందన్నారు. టూరిజం వస్తే ఆదాయం వస్తుందన్నారు. కానీ ఆంక్షలు ఉండటం వల్ల అలా జరగడం లేదన్నారు. గోవాలో మాత్రం పర్యాటకులపై ఇలాంటి ఆంక్షలు లేవని అయన్నపాత్రుడు గుర్తుచేశారు. ఇలాంటి పరిస్దితుల్లో ఇక్కడికి ఎవరైనా వస్తారా అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. స్పీకర్ అయ్యన్న కూడా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే. అటువంటప్పుడు ప్రభుత్వం దృష్టికి ఇదే విషయం తీసుకెళ్లి విశాఖలో ఆంక్షలు సడలించేలా చేయొచ్చు కదా అనే చర్చ జరుగుతోంది. అలా చేయకుండా గోవా తరహాలో వైజాగ్ టూరిజం అభివృద్ధి చెందకపోవడానికి ఆంక్షలే కారణమంటూ ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఎందుకన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా స్పీకర్ ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారో లేదో చూడాలి మరి.












Click it and Unblock the Notifications