పివి, టిపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు: పార్టీ ఇంఛార్జ్‌గా మళ్లీ!

ఆయన హైదరాబాదులో జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహా రావు స్మారక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులను రాజీవ్ ఎంపిక చేసిన సమయంలో చివరిదాకా ఆ ప్రక్రియలో తాను పాలు పంచుకున్నానని, చివరి రోజున రాజీవ్ ఫోతేదార్‌ను, తనను పిలిచి పివి దగ్గరకెళ్లి ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అడిగి రమ్మని పంపారన్నారు.
తామిద్దరం వెళ్లి అడిగితే పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని, పుస్తక రచనలో నిమగ్నమవుతానని పివి చెప్పారన్నారు. రాజీవ్ చెన్నై సమీపంలో జరిగిన సభలో మరణించిన రోజు పివి, తాను కలిసి ఒకే విమానంలో ఢిల్లీ నుంచి నాగపూర్ వెళ్లామన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇచ్చారని, ఆయన లోకసభలో బల నిరూపణ చేయాల్సి వచ్చినప్పుడు తొలుత తమకు 25 మంది సభ్యులు తక్కువుంటే.. బల పరీక్షలో 50 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతూ... విభజన విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుందని, 2014 ఎన్నికల్లోగా ఎపిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని భావిస్తున్నానని, విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని, దాన్ని ఆమోదిస్తారో, వ్యతిరేకించి పంపిస్తారో మెజార్టీ సభ్యుల అభిప్రాయంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
నెల రోజులుగా చూస్తున్నా అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగడం లేదని, రాష్ట్రపతి ఇచ్చిన గడువు (23 తేదీ)లోగా అసెంబ్లీ తన అభిప్రాయం కేంద్రానికి పంపుతుందని ఆశిస్తున్నానన్నారు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని పంపాలని, గడువులోగా పంపుతారని భావిస్తున్నానని, దానిపై రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అసెంబ్లీ నుంచి కేంద్రానికి బిల్లు వచ్చాక ప్రత్యేక పార్లమెంటు సమావేశాల గురించి ఆలోచిస్తామన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టరన్నారు.
ఇన్‌చార్జిగా మళ్లీ ఆజాద్!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మళ్లీ గులాం నబీ ఆజాద్ వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నెల 17వ తేదీ తర్వాత ఆరుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని వారిలో ఆజాద్ కూడా ఉంటారని చెబుతున్నారు.
ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్ మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తనను పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన అధిష్ఠానాన్ని ఇప్పటికే పలుమార్లు కోరారని పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆజాద్‌ను నియమించే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications