నెల్లూరులో దారుణం.. సంచలనంగా బి-ఫార్మసీ విద్యార్థిని మర్డర్ !
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద విద్యార్థిని మైధిలి ప్రియ.. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైంది. ఇటీవలే బీ-ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన మైధిలి.. భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉన్న వేళ ఇలాంటి విషాదం జరగడం అందరినీ కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు నిఖిల్ (Nikhil) మైధిలిని తన రూమ్‌కి పిలిచాడు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలపై వాగ్వాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆ క్రమంలో నిఖిల్ ఆగ్రహానికి లోనై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మైధిలి ప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం మృతురాలి చెల్లెలికి ఫోన్ చేశాడు. గొడవ జరిగిందని, మీ అక్కను చంపేశానని తెలిపాడు.

ఆ తర్వాత నిఖిల్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మైధిలి ప్రేమను తిరస్కరించడంతో కోపం చెంది నిఖిల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిఖిల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ దారుణ సంఘటనతో మైధిలి కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు నిఖిల్‌కు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని మృతురాలి బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్పీ సింధుప్రియ సహా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ ఘటనతో నెల్లూరులో యువతుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవుతున్నాయి.













Click it and Unblock the Notifications