జంతర్ మంతర్ వద్ద బాబు దీక్ష: టి నేతలుకు ఆహ్వానం
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో తలపెట్టిన ఆమరణ దీక్షకు వేదిక ఖరారైంది. జంతర్‌మంతర్‌లో ఆయన దీక్షకు కూర్చోబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏడో తేదీ ఉదయం ప్రారంభం కానున్న ఈ దీక్షకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబు దీక్షలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో వెళ్లనున్నారు.
ఈ దీక్ష దేశ రాజధానిలో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్న పట్టుదల పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీనికి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ముఖ్య నేతలూ హాజరవుతున్నారు. ఈ మేరకు బాబు శనివారం ఇక్కడ ఇరుప్రాంత నేతలతో సమావేశమై దీక్ష ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ దీక్ష తెలంగాణకు వ్యతిరేకమన్న అభిప్రాయం కలగకుండా చూడాలని ఆ ప్రాంత నేతలను ఆయన కోరారు.

తెలంగాణను ఆడ్డుకోవడానికే బాబు దీక్ష చేస్తున్నారన్న అభిప్రాయం కలిగించడానికి ఈ ప్రాంతంలోని ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తుండటం పైన దృష్టి సారించారు. బాబు దీక్ష చేస్తోంది తెలంగాణకు వ్యతిరేకంగా కాదని ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. విభజన వల్ల సీమాంధ్రకు కొన్ని బలమైన సమస్యలొస్తున్నాయని, దానిపై ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన ఉందని అందుకే ఉద్యమం నడుస్తోందని, వారి సమస్యలపై కనీస పట్టింపు లేకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలంటే వారి సమస్యలపై బాధ్యతగా ఉండాలని బాబు ఇరు ప్రాంతాల నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనం పార్టీ పరంగా లేఖ ఇచ్చామని, ఇప్పుడు అటువైపు ఉద్యమం ఉన్నప్పుడు వారికి అండగా నిలవాల్సి ఉందని, కాంగ్రెస్ పార్టీ ఇటు తెరాసను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కలుపుకొని ఎన్నికల్లో గెలుపు సాధించాలని ప్రయత్నిస్తోందని టిడిపి భావిస్తోంది.
ఇలా ఆ పార్టీ చేస్తున్న కుమ్ముక్కు రాజకీయాలను దేశంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉందని భావిస్తోంది. తెలంగాణ ప్రాంత నేతలూ తన దీక్ష సమయంలో ఢిల్లీకి రావాలని ఆయన ఆహ్వానించగా వారు అంగీకరించారు.












Click it and Unblock the Notifications