ఎన్నికల వేళ.. చిక్కుల్లో పడ్డ వైఎస్ షర్మిల
YS Sharmila: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సైతం తన ప్రచార ఉధృతిని పెంచింది. ప్రత్యేకించి- రాయలసీమ జిల్లాలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేలా కనిపిస్తోంది.

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల తన సొంత జిల్లా, నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. తన అన్న, ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తోన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును షర్మిల పదే పదే ప్రస్తావిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ కడప లోక్‌సభ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ హత్యోదంతంలో ప్రమేయం ఉన్నట్లు ఆమె చెబుతోండటం అటు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని ప్రస్తావించకూడదంటూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ- షర్మిల పట్టించుకోవట్లేదు. షర్మిల గానీ, ఆమె చెల్లెలు, వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత గానీ ఈ ఘటన చుట్టే ప్రచారం చేస్తోండటం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.
ఈ క్రమంలో షర్మిలపై కడప జిల్లా బద్వేలులో కేసు నమోదైంది. వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కడప న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసినప్పటికీ- ఆమె అదే అంశాన్ని ప్రస్తావిస్తోండటం దీనికి కారణమైంది. వైఎస్ఆర్సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బద్వేలు పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications