అన్ని ప్రాంతాలవారూ అడుగుతున్నారు: పోటీపై బాలకృష్ణ
కర్నూలు: వచ్చే ఎన్నికల్లో తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని అన్ని ప్రాంతాలవాళ్లూ అడుగుతున్నారని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ చెప్పారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
లెజెండ్ సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారంనాడు కర్నూలు వచ్చారు. ఆయనకు కర్నూలులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. మౌర్య ఇన్ హోటల్ నుంచి లెజెండ్ సినిమా ప్రదర్శిస్తున్న ఆనంద్ థియేటర్ వరకు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో దారులు క్రిక్కిరిసిపోయాయి. లెజెండ్ సినిమాలోని డైలాగులు చెబుతూ బాలకృష్ణ అబిమానులను అలరించారు. ఆయన కొద్ది రోజులుగా లెజెండ్ విజయోత్సవ యాత్రలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాననే విషయాన్ని ఆయన కచ్చితంగానే చెబుతున్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికే ఆ విషయాన్ని వదిలేశాననే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications