ఐటి పరిశ్రమలు తెస్తా: బాలకృష్ణ, మోసం చేస్తే: అంబటి
అనంతపురం/ హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గానికి ఐటి పరిశ్రమలు తీసుకుని వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని శానససభ్యుడు నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
గార్మెంట్ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఎక్కువ మంది మహిళలు కర్ణాటకకు తరలిపోతున్నారని, దాన్ని నిరోధించి స్థానికంగా ఉపాధి కల్పించడానికి స్థానికంగా గార్మెంట్ పరిశ్రమలను స్థాపిస్తామని ఆయన చెప్పారు. హిందూపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రైతులను మోసం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రభుత్వమైనా సర్వనాశనమే అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రుణాలు కట్టవద్దని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారని, అయితే రుణమాఫీపై ఇప్పటి వరకూ ఏం చేశారో చెప్పాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు రైతులు రుణమాఫీపై అయోమయంలో ఉన్నారని ఆయన అన్నారు. కాలయాపన చేయకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని అన్నారు. వరి మద్దతు ధరపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచానికి పాఠాలు చెప్పానన్న చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగారు.












Click it and Unblock the Notifications