సోదరి పాడె మోసిన బాలయ్య - ఉమామహేశ్వరికి కన్నీటి వీడ్కోలు..!!
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉమా మహేశ్వరి బలవన్మరణంతో నందమూరి కుటుంబం విషాదం లో మునిగిపోయింది. ఉమా మహేశ్వరి బలవన్మరణం విషయం తెలుసుకున్న వెంటనే సోదరుడు బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. ఉమా మహేశ్వరి కుమార్తె తన తల్లి మరణించిన విషయం బాలయ్యతో పాటుగా లోకేష్.. చంద్రబాబు.. దగ్గుబాటి వేంకటేశ్వర రావుకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో..పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి డెడ్ బాడీని అప్పగించారు. ఉమా మహేశ్వరి పెద్ద కుమార్తె అమెరికా నుంచి ఈ ఉదయం చేరుకున్నారు. ఆ వెంటనే ఉమా మహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ తమ సోదరి ఉమా మహేశ్వరి పాడెను మోసారు. చంద్రబాబుతో సహా నందమూరి కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కళ్యాణ్ రామ్, నారా భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలు నివాళి అర్పించారు.

ఉమా మహేశ్వరి పార్థీవ దేహానికి మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు నివాళులు అర్పించారు. ఉమా మహేశ్వరి చనిపోవడం బాధాకరమని ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని మంత్రులు పేర్కొన్నారు. చిన్న కూతురు అంటే ఎన్టీఆర్కు అత్యంత ఇష్టమన్నారు. దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఉమామహేశ్వరి చితికి భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. రాజకీయ ప్రముఖులతో పాటుగా సినీ రంగానికి చెందిన వారు సైతం ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications