"మా" లో ఓటు కావాలంటే ఫోన్ చేయండి-ప్రాణాలతో చెలగాటం వద్దు : ప్రకాశ్ రాజ్ కు బండ్ల షాక్..!!
"మా" ఎన్నికల వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత..హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత-హేమ తో చర్చలు జరిపి వారిద్దరిని తన ప్యానెల్ లో చేర్చుకున్నారు. జీవితను ప్రధాన కార్యదర్శి పదవికి బరిలో దింపాలని నిర్ణయించారు.

ప్రకాశ్ రాజ్ ప్రచారం ఆరంభం
దీంతో...ఆ నిర్ణయం పైన తనకు కనీసం మాట కూడా చెప్పకపోవటంతో పాటుగా గతంలో మెగాస్టార్ వర్సెస్ జీవిత- రాజశేఖర్ ఎపిసోడ్ కారణంగా బండ్ల ఇప్పుడు ఆ ప్యానల్ నుంచి బయటకు వచ్చేసారు. స్వతంత్రంగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఇదే సమయంలో తన ప్యానెల్ సభ్యులతో కలిసి "మా" ఓటర్ల వద్దకు ప్రకాశ్ రాజ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తమ ప్యానల్ సభ్యులతో ప్రకాశ్ రాజ్ సమావేశయ్యారు. ఇక ఆదివారం 'మా' సభ్యులందరిని విందుకు ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపారు.
బండ్ల గణేష్ సీరియస్ రియాక్షన్
దీంతో బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీటర్‌లో ఓ వీడియో సందేశం విడుదల చేసారదు. ప్రకాశ్ రాజ్ 'మా' సభ్యులను విందుకు ఆహ్వానించడంపై బండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 'దయచేసి 'మా' కళాకారులనువిందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు.. చాటా మంది చావు దాకా వెళ్లొచ్చారు. అందులో నేను ఒకడిని...అంటూ చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ రెండు సార్లు కరోనా బారిన పడ్డారు.

ప్రకాశ్ రాజ్ తో విభేదించి...ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ
రెండో సారి కరోనా వచ్చిన సమయంలో చిరంజీవి తనకు సాయం చేసారని బండ్ల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ఈ వీడియోలో "మా" ఎన్నికల్లో భాగంగా.. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండని సూచించారు. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి' అంటూ బండ్ల వీడియో మెసేజ్ లో సూచించారు. జీవితపై తను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ ఇప్పటికే బండ్ల గణేష సవాళ్లు చేస్తున్నారు.

విష్ణు రంగంలోకి దిగితే..మరింత మదురుతుందా
అయితే, అధ్యక్ష బరిలో నిలుస్తామని చెప్పిన వారిలో ముగ్గురు సభ్యులు డ్రాప్ అవ్వటంతో...ఇక, ఇప్పుడు ప్రధాన పోరు ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణుగా జరగనుంది. అక్టోబర్ 10న "మా" ఎన్నికల నిర్వహణకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇక, ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్రచారం సైతం ప్రారంభించారు. విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన తన ప్యానల్ ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో.. ఇక, ఇద్దరూ తమ ప్యానెల్ తో ప్రచారం ప్రారంభిస్తే.."మా" ఎన్నికల వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications