చంద్రబాబు కోసం .. బండ్ల గణేష్ కన్నీటి పర్యంతం!!
టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన సంఘీభావ సభకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబును తలుచుకుని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కన్నీటి పర్యంతం అయ్యారు. చంద్రబాబు ఏ తప్పు చెయ్యలేదని, జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విజన్ ఉన్న నాయకుడిని జైల్లో పెట్టినవారు మట్టికొట్టుకుపోతారంటూ బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు జైల్లో ఉండటంతో తాము పండుగలు చేసుకోవటం లేదని, కనీసం దీపావళి అయినా జరుపుకుంటాం అన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు. చంద్రబాబు దీపావళికి అయినా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టారని అడుగుతున్నారని, శ్రీకృష్ణుడు అంతటివాడు జైల్లో పుట్టాడని, రాముడికే వనవాసం తప్పలేదని, చంద్రబాబు కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని అన్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టటంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన బండ్ల గణేష్ చంద్రబాబు కోసం మా ప్రాణాలు ఇస్తామన్నారు. సైబరాబాద్ లాగా ఏపీలోని అమరావతి, గుంటూరు, రాజమండ్రిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు అనుకున్నారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. జనం కోసిన బతికిన నేత , బతుకుతున్న నేత అయిన చంద్రబాబును జైల్లో పెట్టారంటూ గణేష్ కన్నీటి పర్యంతమయ్యారు.
మీ కోసం అవసరం అయితే చచ్చిపోతా సార్ అంటూ బండ్ల గణేష్ ఉద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబు దేశానికి అవసరం అంటూ ఆయన మాట్లాడారు. చంద్రబాబు కోసం జైలు ఖర్చులు అందరం పెట్టుకుంటున్నామని బండ్ల గణేష్ పేర్కొన్నారు. సభలో బండ్ల ప్రసంగం ఆసాంతం ఉద్వేగంగా సాగింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నిజంగానే నిజాన్ని గెలిపిస్తుంది. ఇది తథ్యం అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications