వైసీపీ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకర్లు సహకరించాలి - సీఎం చంద్రబాబు
వైసీపీ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకర్లు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని కోరారు. పీ4 పాలసీ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భరోసా, ప్రాథమిక రంగానికి రుణాలు, డ్వాక్రా రుణాలు వంటి అంశాలను ప్రస్తావించారు.
అలానే ముద్ర రుణాలు, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా, టిడ్కో ఇళ్లు, రూరల్ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్ వర్క్ విస్తరణ సహా పలు అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసేందుకు ప్రభుత్వంతో బ్యాంకులు చేయి కలపాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రజల ఆహార అలవాట్లు చాలా మారాయని.. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని.. అన్నదాతల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలన్నారు. హార్టికల్చర్, ప్రకృతి సాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలని చంద్రబాబు కోరారు. ఎంఎస్‌ఎంఈ రుణాలను కేంద్రం సులభతరం చేసిందని.. పీఎం సూర్య ఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ఇవ్వడమే లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications