9 నెలల్లో ఇవ్వాలంటే ప్రయత్నిస్తా: మంజునాథ్, ఏపీలో బీసీ వర్సెస్ కాపులు!
విజయవాడ: రిజర్వేషన్లు కావాలంటున్న కాపులతో పాటు, వ్యతిరేకిస్తున్న వారితోను తాను మాట్లాడుతానని బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ గురువారం నాడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన ఈ రోజు భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కమిషన్లో ఇంకా సభ్యులను నియమించవలసి ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు పైన వ్యాఖ్యానించనని చెప్పారు. 9 నెలల్లోనే నివేదిక కావాలని ప్రభుత్వం కోరితే తాను ప్రయత్నిస్తానని మంజునాథ్ చెప్పారు. తాము అందరితోను మాట్లాడుతామన్నారు.
బీసీల్లో చేర్చాలని కాపులు... వద్దని బీసీలు
రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ల పేరిట తెరపైకి వచ్చిన కొత్త డిమాండ్ కొత్త వాగ్యుద్ధానికి తెర లేపింది. కొద్ది రోజులుగా కాపులు.. తమకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఉద్యమిస్తున్నారు.

దీంతో, కాపులను బీసీల్లో చేర్చవద్దని బీసీలు చెబుతున్నారు. వారికి రూ.వెయ్యి కోట్లు కాదని, రెండువేల కోట్లు ఇచ్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, రిజర్వేషన్లు కల్పించినా మాట్లాడమని, కానీ బీసీలలో చేర్చితే మాత్రం ఊరుకునేది లేదని బీసీ నేత కృష్ణయ్య చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో కాపు నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఐక్య గర్జనకు లక్షలాదిగా కాపులు తరలివచ్చారు. ఆ తర్వాత కొందరు దుండగులు బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమం మరింత ఉదృతమవుతోంది.
ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న 25 శాతం రిజర్వేషన్లలో కొంత కోటాను చీల్చి కాపులకు ఇవ్వవద్దని బీసీలు భగ్గుమంటున్నారు. కాపు ఉద్యమాలకు వ్యతిరేకంగా ఏపీలోని ప్రధాన పట్టణాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీసీ సంఘాలు సిద్ధమయ్యాయి.
బుధవారం నాడు విజయవాడలో ఒకే వేదిక పైకి వచ్చిన బీసీ సంఘాలన్నీ కాపులపై సమర భేరీని మోగించాయి. అసలు కాపులకు బీసీ ట్యాగ్ ఎందుకని బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు.
తమ కోటాలో కోత విధిస్తే, చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా గురువారం నాడు కాకినాడలోని తూర్పు గోదావరి కలెక్టర్ కార్యాలయాన్ని వందలాది మంది బీసీలు ముట్టడించారు. అయితే, బీసీలు మొదటి నుంచి టిడిపి వెంటే ఉన్నారని, వారికి అన్యాయం జరగకుండా కాపులను చేర్చుతామని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications