BGT ఎక్స్ ప్రెస్: దక్షిణమధ్య రైల్వే కొత్త రైలుబండి
పుణ్యక్షేత్రాలు చూడాలనుకునే భక్తులైన రైలు ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే కొత్త రైలుబండిని అందుబాటులోకి తెచ్చింది.
భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. పూరీ-కాశీ-అయోధ్యలను దర్శించుకునేందుకు పుణ్యక్షేత్ర యాత్రను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

భారత్ గౌరవ్ టూరిస్ట్ ఎక్స్ ప్రెస్
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. మార్చి 18న, ఏప్రిల్ 18న ఈ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరతాయి. ప్యాకేజీకి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. మార్చి 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయల్దేరే ఈ ప్రత్యేక రైలు.. 8 రోజుల పాటు పూరీ, కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.
తిరిగి 26వ తేదీ ఉదయం 6.00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఏప్రిల్ 18న బయల్దేరే రెండో రైలు మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి.. దర్శనీయ ప్రాంతాలను చుట్టేసి ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 11.00 గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

యాత్ర వివరాలు..
సికింద్రాబాద్‌లో ప్రారంభమైన రైలు పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగుతుంది. రైల్లో మొత్తం 700 సీట్లు ఉన్నాయి.
460 స్లీపర్ బెర్త్ లు, 192 థర్డ్ ఏసీ బెర్త్ లు, 48 సెకండ్ ఏసీ బెర్త్ లు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్ర యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసి-కాశీ విశ్వనాథ్ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరం తదితర దర్శనాలను భక్తులకు కల్పిస్తారు.
యాత్ర 8 రాత్రులు, 9 రోజుల వరకు కొనసాగుతుందని జైన్ తెలిపారు. ఆ తర్వాత రెండో రైలుఏప్రీల్ 18న నడిపిస్తున్నామని, మొదటి రైలుకు ఇప్పటికే విశేష ఆదరణ లభిస్తోందని, 90శాతం సీట్లు నిండిపోయాయని జీఎం తెలియజేశారు. రెండవ రైలులో 20శాతం సీట్లు భర్తీ అయనట్లు చెప్పారు.

టిక్కెట్ ధర ఎంతంటే?
700 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా ధరను నిర్ణయించారు. స్లీపర్ తరగతి (ఎకానమీ)లో టికెట్ ధర ఒకరికి రూ.15,300(స్లీపర్); రూ.24,085 (థర్డ్ ఏసీ), రూ.31,500 (సెకండ్ ఏసీ) ఛార్జీలుగా నిర్ణయించారు. డబుల్/ట్రిపుల్ షేర్ రూ.13,955(స్లీపర్); రూ.22,510(థర్డ్ ఏసీ), రూ.29,615(సెకండ్ ఏసీ)గా నిర్ణయించారు. అదే 5-11 సంవత్సరాల మధ్య చిన్నారులకైతే ఈ ధరలు వరుసగా రూ.13,060, రూ.21,460, రూ.28,360 చొప్పున ఉన్నాయి.

గదుల కేటాయింపు?
యాత్రికులు ప్రయాణించే తరగతులను బట్టి వారికి గదుల కేటాయింపు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఈ రైలులో భక్తులైన ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే) అందిస్తారు.
ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంది. ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావని, వీటికి పర్యాటకులే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని జైన్ చెప్పారు.

క్యాన్సిలేషన్ పాలసీ..
అకస్మాత్తుగా పర్యటనకు వద్దామనుకొని టికెట్ బుక్ చేసుకొని అకస్మాత్తుగా ఆగిపోయినవారు యాత్రకు 15 రోజులు మందు రద్దుచేసుకుంటే రూ.250 కాన్సిలేషన్ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్ ధరలో25 శాతం, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే టికెట్ ధరలో 50 శాతం, నాలుగు రోజులకన్నా తక్కువైతే వందశాతం కోల్పోవాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications