ఎన్టీఆర్ కు భారత రత్న : బీజేపీ - వైసీపీ కొత్త పొలిటికల్ స్కెచ్..!?
ఎన్టీఆర్. ఈ పేరే తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. మరణించి 27 ఏళ్లు అయినా ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనేది చిరకాల డిమాండ్. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జన్మదినం..వర్దంతి రోజుల్లో నేతలు నివాళి అర్పించటం.. భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయటం పరిపాటిగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పైన కన్నేసిన బీజేపీ దీనినే అస్త్రంగా మలచుకొనే వ్యూహాల తో సిద్దం అవుతోంది. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ద్వారా తమ అజెండా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు భారత రత్న అంశం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. ఈ నిర్ణయం అమలు చేస్తే బీజేపీకి ఆ క్రెడిట్ దక్కుతుందా. రాజకీయంగా బీజేపీకి కలిసి వస్తుందా..టీడీపీని ఆత్మరక్షణలోకి నెడుతుందా..ఏం జరుగుతోంది..

టీడీపీ స్థానం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..
తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అధికారం దక్కించికుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. పొత్తుల కారణంగానే ఇప్పటి వరకు నష్టపోయామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కు ఆయుధంగా మారుతుందని పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే హైకమాండ్ కు నివేదించారు. ఏపీలో పొత్తు కారణంగా వచ్చే తక్షణ ప్రయోజనం కంటే..పార్టీ భవిష్యత్ కోసం సంస్థాగతంగా బలోపేతం కావటమని ఢిల్లీ నేతలు తాజాగా ఏపీ నేతలకు స్పష్టం చేసారు. ఎలాగైనా టీడీపీ స్థానంలో తాము ఎదగాలనేది బీజేపీ ఆకాంక్ష. ఇందు కోసం వ్యూహాత్మకంగా అడుగులు ప్రారంభిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ను కీర్తించారు.

ఎన్టీఆర్ పేరు పై ఏపీలో వివాదం..
ఏపీలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు చేర్చటం పైన రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేయటం ద్వారా వచ్చిన ఇమేజ్ వర్సిటీ పేరు మార్పుతో తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక, వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కు భారత రత్న గురించి చర్చ జరిగింకదని.. చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ కు అవార్డు దక్కలేదని నందమూరి కుటుంబాన్ని అభిమానించే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. ఇక వైసీపీ నేతలు సైతం పలు సందర్భాల్లో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటి పొడిచి అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు. దీనికి బాలయ్య తో నిర్వహించిన అన్ స్టాపబల్ షో ద్వారా చంద్రబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం సమయంలోనే..టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేలా ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చలు మొదలయ్యాయి.

ఎన్టీఆర్ కు భారతరత్న దక్కేనా - నిర్ణయం దిశగా
ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం భారత రత్నతో పాటుగా పద్మ అవార్డులను ప్రకటించటం ఆనవాయితీ. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు పైనా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు కావటంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఎన్టీఆర్ కు అవార్డు కు వాజ్ పేయ్ ప్రభుత్వం అప్పట్లోనే సిద్దం కావటంతో, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. కేంద్ర నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications