విశాఖను కాదని డేటా సెంటర్లకు నీరు ? అసెంబ్లీలో తేల్చేసిన లోకేష్..!
ఏపీలో కూటమి సర్కార్ డేటా సెంటర్లను (Data Centres) తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభమైంది. విశాఖలోనే మరికొన్ని సంస్ధలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం దారులు తెరిచింది. ఈ నేపథ్యంలో విశాఖలో నీటి కొరత తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నగరంలో దీనిపై ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై ఇవాళ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీలో స్పందించారు. డేటా సెంటర్లపై అపోహలు వద్దన్నారు. డేటా సెంటర్లపై నెలకొన్న ఆందోళనలపై అసెంబ్లీలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు.
కొంతమంది కావాలని డేటా సెంటర్లపై అపోహలు సృష్టిస్తున్నారని, గూగుల్ విశాఖ వస్తున్నామని ప్రకటించాకే ఐటీ సంస్థలు నగరం వైపు చూస్తున్నాయని లోకేష్ తెలిపారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో హైటెక్ సిటీ తెస్తే రేడియేషన్ తో ఓ ఉద్యోగి చనిపోయాడని విపక్షాలు గగ్గోలు పెట్టాయని, అప్పుడు వెనక్కి తగ్గితే ఇప్పుడు ఐటీ సిటీ అభివృద్ధి చెందేది కాదన్నారు. డేటా సెంటర్లపై వస్తున్న అపోహలు కూడా అలాంటివే అన్నారు. గోదావరిలోకి ఏటా వృథాగా పోయే 3 వేల టీఎంసీల నీటిలో కొంత భాగం గ్రావిటీ ద్వారా పోలవరంలోకి మళ్లించి విశాఖకు తెస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో ఏర్పాటైతే 3 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు.

పరిశ్రమలకు కేటాయించిన నీటి వాటా నుంచే డేటా సెంటర్లకు అవసరమైన నీరందిస్తామన్నారు. డేటా సెంటర్లకు ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తాం తప్ప విశాఖ నగరం నుంచి మళ్లించేది లేదన్నారు. 1 గిగావాట్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు డేటా సెంటర్ ఉపయోగించే నీటి కంటే 10 రెట్లు ఎక్కువగా వినియోగిస్తుందని, విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్లపై ధర్నా చేస్తున్న వారు ఏనాడు ధర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని లోకేష్ ఆరోపించారు. ఎనర్జీ కావాలి, డేటా సెంటర్ వద్దనడం ఎలా సబబన్నారు.
ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, అడ్వాన్స్ డ్స్ చిప్స్ రావాలి, ఆ చిప్స్ ను గూగుల్ తీసుకువస్తుందన్నారు. దానివల్ల ఎఐకి సంబంధించిన కటింగ్ ఎడ్జ్, ఇతర కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటాయన్నారు. అలాగే రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటుతో అక్కడ కేవలం కూలింగ్ ఎకోసిస్టమ్ వల్ల 20వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఎక్కడా పర్యావరణ ఉల్లంఘనలు జరగడం లేదన్నారు.














Click it and Unblock the Notifications