Bheemili Assembly Election 2024 Results LIVE: గంటాపై గంపెడు ఆశలు
భీమిలీ అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య హోరాహోరి పోరు తప్పట్లేదు.
ఈ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూసే నియోజకవర్గాల్లో ఒకటి- భీమిలి. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా తన గెలుపును రిపీట్ చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక్కడ. 2009లో ప్రజారాజ్యం, 2014లో తెలుగుదేశం, 2019లో వైసీపీ విజయం సాధించాయి.

పార్టీ వేరయినా అవంతి శ్రీనివాస్ రెండుసార్లు ఇక్కడ విజయఢంకా మోగించారు. ఇంకోసారి గంటా శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన అవంతి.. 6,310 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆంజనేయ రాజును మట్టికరిపించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థానంలో నిలిచింది.
మొత్తంగా 1,76,353 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అప్పట్లో. అవంతి శ్రీనివాస్‌కు 29.56 శాతంతో 52,130 ఓట్లు పోల్ అయ్యాయి. ఆంజనేయ రాజుకు 25.98 శాతంతో 45,820, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పీ ఉమా రాణికి 23.37 శాతంతో 41,219 ఓట్లు పడ్డాయి.
2014 ఎన్నికల నాటికి రిజల్ట్ రివర్స్ అయింది. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గంటా శ్రీనివాస్ 37,226 ఓట్ల తేడాతో పాగా వేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కర్రి సీతారాముకు 81,794 ఓట్లు పోల్ అయ్యాయి. 2,11,826 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 41 శాతం ఓట్లు గంటాకు పడ్డాయి.
అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019లో భీమిలీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరిపై 9,712 ఓట్ల తేడాతో విజయం సాధించారు అవంతి శ్రీనివాస్. 2,17,794 ఓట్లు పోల్ కాగా.. అందులో అవంతికి 44.21 శాతం అంటే 1,01,629 ఓట్లు పోల్ అయ్యాయి. సబ్బం హరి- 91,917, జనసేన అభ్యర్థి డాక్టర్ పంచకర్ల సందీప్- 24,248 ఓట్లు పడ్డాయి.
ఈ ఎన్నికల్లో పాత ప్రత్యర్థులు.. అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ మళ్లీ ఎదురుపడ్డారు. వైఎస్ఆర్సీపీ నుంచి అవంతి, టీడీపీ తరఫున గంటా పోటీలో దిగారు. ఈ సారి భీమిలీలో 75.96 శాతం మేర పోలింగ్ నమోదైంది. మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి సంఖ్య 51 శాతంగా తేలింది. మహిళలు, రూరల్ ఓటింగ్ తమను గెలిపిస్తుందని వైసీపీ ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications