ఏపీలో ఆ అంతర్జాతీయ విమానాశ్రయమే కాదు ఏవియేషన్ యూనివర్సిటీ కూడా.. సూపర్ న్యూస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన నేపథ్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి కావడంతో ఏపీపైన ప్రధానంగా దృష్టి సారించి, ఏపీలో వైమానిక రంగ ప్రగతికి దోహదం చేస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపైన అధికారులతో మాట్లాడారు. ఇదే సమయంలో కీలక ప్రకటన కూడా చేశారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీలక కేంద్రంగా మారుతుందని కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ఈ ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రధాన వేదిక అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

2026లో మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక సవాల్ గా స్వీకరించాలని పేర్కొన్న ఆయన అన్ని అడ్డంకులను అధిగమించి సమయానికి పూర్తి చేయడానికి అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. 2026 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో విమానం ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ విమానాశ్రయంతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు
ఈ విమానాశ్రయం వల్ల ఎంతో మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం పనులు నాణ్యతతో జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన విశాఖపట్నం కంటే ఇక్కడే ఎక్కువ విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు విమానయాన సంస్థలతో చర్చలు జరిగినట్టుగా పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు పనులు 91.3 శాతం పూర్తి
నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ సదుపాయాలతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు 91.3 శాతం పూర్తయిందని, ప్రస్తుతం విమానాశ్రయంలో టాక్సీ వే రెండువేల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతోందని, విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సులో ఏవియేషన్ రంగానికి చెందిన పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని మంత్రి ప్రకటన చేశారు.
2026 జూన్ నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం
ఉత్తరాంధ్ర ప్రాంత సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబించేలా డిజైన్లను అధికారులకు సూచించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పరిశ్రమలకు, వాణిజ్యానికి, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications