వైసిపి మహిళా నేతలపై అఖిల, శిల్పా చక్రపాణి అందుకే దూరం.. తేల్చి చెప్పిన టిడిపి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయటి ప్రాంతం నుంచి మహిళా ఎమ్మెల్యేలు నంద్యాలకు వచ్చి ప్రచారం చేస్తున్నారని, వారికి ఇక్కడి విషయాలు తెలియవని మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయటి ప్రాంతం నుంచి మహిళా ఎమ్మెల్యేలు నంద్యాలకు వచ్చి ప్రచారం చేస్తున్నారని, వారికి ఇక్కడి విషయాలు తెలియవని మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు.
నంద్యాల నియోజకవర్గంలో దొంగ ఓట్లను చేర్చడంలో శిల్పా మోహన్ రెడ్డి సిద్ధహస్తుడని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఇటీవల కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులపై మూడు దశల్లో విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శిల్పా అలా చేస్తున్నారు
శనివారం నంద్యాలలో మంత్రులు విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసిపి నాయకుల్లో ఉందని, అందుకే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. శిల్పా మోహన్ రెడ్డి పలు ప్రాంతాల నుంచి తమ పార్టీ వారిని పిలిపించి ఓట్లు చేర్పించే కార్యక్రమం చేపట్టారన్నారు. దీనిపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

త్వరలో జైలుకు జగన్
జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపు తథ్యమని మరో టిడిపి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యకం చేశారు. జగన్‌కు ఇవే చివరి ఎన్నికలని ఆయన త్వరలోనే జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. జగన్ అహం తగ్గాలంటే నంద్యాల ప్రజలు భూమా బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

రూ.50 కోట్ల వరకు అక్రమ సొమ్ము దొరుకుతుంది
గత 35 ఏళ్లలో ఎన్నడూలేని అభివృద్ధిని ప్రస్తుతం నియోజకవర్గంలో చేస్తున్నామని, దీనిని జీర్జించుకోలేని వైసిపి నేతలు అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని సోమిశెట్టి ఆరోపించారు. శిల్పా మోహన్ రెడ్డి ముందస్తు ప్రణాళికతో 42 డివిజన్లలో ఆయన అనుచరుల వద్ద డబ్బులు దాచి ఉంచారని, అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేస్తే రూ.50 కోట్ల వరకు అక్రమ సొమ్ము దొరుకుతుందని ఆరోపించారు.

శిల్పా చక్రపాణి రెడ్డి వంద శాతం టిడిపికే కానీ
రాజకీయ వ్యామోహంతో శిల్పా చిన్నపిల్లాడిపై పోటీ చేస్తున్నారని, డబ్బుతో ఏమైనా సాధించవచ్చుననే భ్రమతో శిల్పా మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శిల్పా చక్రపాణి రెడ్డి వందశాతం టిడిపికే మద్దతు ఇస్తున్నారని, నంద్యాల ఎన్నికల ప్రచారానికి తాను కొంచెం దూరంగా ఉంటానని స్వచ్ఛందంగానే తప్పుకున్నారని సోమిశెట్టి చెప్పారు.

ఆ అపవాదు వద్దనే ప్రచారానికి దూరం
ఒకవేళ శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపికి ప్రచారం చేసినా లేనిపోని అపోహలు, అపవాదులు ప్రచారంలోకి వస్తాయని, అందుకనే అధిష్టానం అనుమతితోనే ఆయన ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నారని సోమిశెట్టి చెప్పారు. జగన్ కాపులను రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని చూశారని, ఇందులో భాగంగానే ముద్రగడను పావుగా వాడుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications