ఏవీ సుబ్బారెడ్డిపై దాడికేసు: భూమా అఖిలప్రియ భర్తకు బెయిల్ మంజూరు!!
టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి పై దాడి కేసులో అరెస్ట్ అయిన మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి పై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఇటీవల భూమా అఖిలప్రియ కు బెయిల్ మంజూరు అయింది. ఇక తాజాగా ఆమె భర్త భార్గవ్ రామ్ కు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణా రెడ్డి వాదనలు వినిపించారు.

నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న ఆధిపత్య పోరే భూమా అఖిల ప్రియ దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదానికి కారణం. నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలైన భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఏ వి సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి మరణం అనంతరం ఆ కుటుంబానికి దూరంగా జరిగారు.
దీంతో నంద్యాలలో టిడిపి రాజకీయాలలో వర్గ పోరు మొదలైంది. ఈ వర్గ పోరు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సాక్షిగా బయటపడింది. లోకేష్ పాదయాత్రలో భగ్గుమన్న వర్గ విభేదాలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్ళింది.
దీంతో ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు భూమా అఖిలప్రియ దంపతులపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వారికి రిమాండ్ విధించగా ఇటీవల భూమా అఖిలప్రియకు, నేడు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications