టిడిపి భేటీకి అఖిలప్రియ, భూమా: ఇంకా వస్తారు.. ఇబ్బంది లేదు: బాబు
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు టిడిపి భేటీకి హాజరయ్యారు. భూమా చాలాకాలం తర్వాత తన టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి మంగళవారం నాడు హాజరయ్యారు.
నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ పై విజయం సాధించిన ఆయన ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురుతో కలిసి కొద్ది రోజుల క్రితం సైకిల్ ఎక్కారు. కర్నూలు జిల్లాకు చెందిన భూమా... గతంలో జిల్లా రాజకీయాల్లో భాగంగా కెఈ కృష్ణమూర్తితో ఉన్న విభేదాల కారణంగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు.
ఆ తర్వాత జగన్ నేతృత్వంలోని వైసిపిలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలుపొందారు. శోభా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి గెలుపొందారు. వీరు ఇటీవలే టిడిపిలో చేరారు.

ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలో ప్రారంభమైన టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి భూమా, ఆయన కూతురు అఖిల వచ్చారు. భూమా పార్టీలోని తన పాత స్నేహితులతో కరచాలనం, ఆలింగనాల్లో మునిగిపోయారు. చాలాకాలం తర్వాత పార్టీ సమావేశానికి వచ్చిన భూమాను టిడిపి నేతలు బాగా స్వాగతించారు.
లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సమావేశంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
ఇంకా చేరేవారు ఉన్నారు: చంద్రబాబు
పార్టీలో చేరేవారు ఇంకా ఉన్నారని, అందరినీ కలుపుకుపోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోకవర్గాలు 175 నుంచి 225కు పెరుగుతున్నాయని, కాబట్టి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్నారు.
కాబట్టి టిడిపిలోకి కొత్త వారు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications