వెంకయ్య.. శ్రీరంగనీతులేనా..!, చినరాజప్పను భూమన ఎంత మాట అనేశారంటే..
హైదరాబాద్ : ప్రతిపక్ష నేతలంతా అధికార పార్టీలకు 'క్యూ' కట్టి ఫిరాయింపులకు పాల్పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఢీలా పడ్డ పరిస్థితి. దీంతో ఫిరాయింపు చట్టాలను మరింత కఠినం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో.. శుక్రవారం నాడు కేంద్రమంత్రి వెంకయ్య చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల డిమాండ్ కి మద్దతు చేకూర్చేవిగా మారాయి.
ఈ నేపథ్యంలోనే వెంకయ్య వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్యెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వెంకయ్య చేసిన వ్యాఖ్యలు శ్రీరంగ నీతులుగా మిగిలిపోకూడదని అన్నారు. శనివారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫిరాయింపులకు పాల్పడ్డ రోజే సదరు నేతలపై వేటు పడాలని కేంద్రమంత్రి వెంకయ్య చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఫిరాయింపు చట్టాన్ని తక్షణం సమీక్షించేలా వెంకయ్య నాయుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందునా.. ఫిరాయింపు చట్టంలో సవరణలు చేసేందుకు బీజేపికి అవకాశం ఉందని, కాబట్టి వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించాలని కోరిన భూమన, ఫిరాయింపులను ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలని వైసీపీ అధినేత జగన్ సూచించిన విషయాన్ని ఈ సందర్బంగా తెలియజేశారు. ఇక వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీ గూటికి చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీ.వై రెడ్డి పార్టీ మారి ఇన్ని రోజులు అవుతున్నా ఆయన సభ్యత్వం మాత్రం కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించిన భూమన, ఏపీలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేసేస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి పదవిని చులకన చేసే స్థితికి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, 'హోంమంత్రి చినరాజప్ప హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్ కి తక్కువ' అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముద్రగడ దీక్షపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందన్న ఆయన, ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలు యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications