భూమా ఎఫెక్ట్, జగన్ 'బ్రేక్' ఫెయిల్!: కడపలో మరో ఎమ్మెల్యే ఝలక్
కడప/కర్నూలు: కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో.. మరికొంతమంది వైసిపి నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నెల రోజుల క్రితమే కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారట.
అయితే, వారితో నేరుగా మాట్లాడిన వైసిపి అధినేత జగన్.. వారి చేరికకు బ్రేకులు వేశారని తెలుస్తోంది. ఇప్పుడు భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరినందున ఆగిపోయిన కొందరు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ అలర్ట్, నేటి వార్తాశీర్షికలను మీ ఇన్‌బాక్స్‌లో పొందండి
చంద్రబాబుతో బద్వేల్ ఎమ్మెల్యే భేటీ
చంద్రబాబుతో కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు భేటీ అయ్యారు. ఆయన టిడిపిలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైసిపికి వరుస షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా వైసిపి సర్పంచులు టిడిపిలో చేరారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ చేరిపోయారు. తాజాగా బద్వేల్ ఎమ్మెల్యే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన కూడా జగన్‌కు షాక్ ఇవ్వనున్నారు.
టిడిపిలో భయం
కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియలు సైకిల్ ఎక్కారు. దీంతో జిల్లాలో టిడిపి బలపడుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, పార్టీ నేతల మధ్య సమన్వయం చిక్కులు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఆళ్లగడ్డ, నంద్యాలల నుంచి టిడిపిలోకి వచ్చిన భూమా కుటుంబ సభ్యులు ఉండటంతో.. ఆ సీటు పైన వచ్చే ఎన్నికలలో ఆశలు పెట్టుకున్న వారు కలవర చెందుతున్నారు. ఇది చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పెద్ద తలనొప్పి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబు నేతలకు సర్ది చెబుతున్నారు. కానీ ఎన్నికల వచ్చేసరికి ఆ సర్దుబాటు కుదరగకోపవచ్చునని అంటున్నారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తే తమ ప్రాబల్యం తగ్గుతుందని స్థానిక నియోజకవర్గ ఇంఛార్జులు ఆందోళన చెందుతున్నారు.

వైసిపికి పొద్దుటూరు నేత ఝలక్?
పొద్దుటూరు వైసిపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నలుగురు కౌన్సిలర్లతో కలిసి ఆయన టిడిపిలో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
చేరిక విషయమై టిడిపి ఎంపి సీఎం రమేష్ తదితరులను ముక్తియార్ కలిశారని సమాచారం. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. అన్నీ కుదిరితే లోకేష్ సమక్షంలో ఈ రోజు సైకిల్ ఎక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
చంద్రబాబు వద్దకు బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఈ రోజు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ వెళ్లనున్న బాలకృష్ణ.. అక్కడి సీఎం క్యాంపు కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా లేపాక్షి ఉత్సవాలకు హాజరు కావాలని చంద్రబాబుకు బాలయ్య ఆహ్వాన పత్రిక అందిస్తారు. ఈ నెల 27 నుంచి లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయి. లేపాక్షి ప్రాచీన వైభవం ఉట్టిపడేలా ఈ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. బాలయ్య అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ సర్కారు అధికారికంగా నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications