కేసులపై భూమా, ఎస్పీ సవాల్: చంద్రబాబుకు ఓకే చెప్పిన జవదేకర్
ఢిల్లీ/కర్నూలు: తెలుగుదేశం పార్టీ నేతల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో పట్టుకోసమే తన పైన, తన కుటుంబం పైన తప్పుడు కేసులు పెట్టారన్నారు.
ఈ కేసులకు తాను ఎట్టి పరిస్థితుల్లో భయపడే పరిస్థితి లేదన్నారు. తన పైన టిడిపి నేతలు అబద్ధపు ప్రచారం చేసి, కర్నూలు ప్రజలకు దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎస్పీ సవాల్
కర్నూలులో తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవికృష్ణ సవాల్ చేశారు. నంద్యాలలో ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారని చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తులతో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. అవసరం అనుకుంటే తాను నంద్యాలలోనే కాపురం ఉంటానన్నారు.

చంద్రబాబు ఢిల్లీలో బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కేంద్రవిద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. అనంతరం అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి అటవీ భూమి అవసరం ఉందని, అటవీ భూమిని డీనోటిఫై చేస్తామని జవదేకర్ చెప్పారన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని పేర్కొన్నారు.
జవదేకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. రాజధాని కోసం 41 అటవీ భూ ములను డీనోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని, అవసరమైన దానిని డీనోటిఫై చేస్తామని చెప్పారు. రాజధాని కోసం అవసరమైన అటవీ భూమిని డీనోటిఫై చేసేందుకు కేంద్రం సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications