‘బాబు ఇస్తానంటే వద్దంటానా! జగన్‌తో గొడవా?: కేసీఆర్ సర్కారు ఊరుకుంటుందా?’
వైసీపీ నుంచి కొంత కాలం క్రితం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత కాలం క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడటం, మంత్రి పదవి, తెలంగాణలో తన పవర్ తదితర అంశాలపై ఆయన స్పందించారు.

జగన్‌తో గొడవా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌తో ఎన్నడూ గొడవలు పడలేదని, తమ ఇద్దరి మధ్యా పాలసీ నిర్ణయాల్లో తేడాలు వచ్చాయే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు రాలేదని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీని వీడాల్సి వచ్చిందని, అంతకన్నా ఇంకేమీ లేదని చెప్పారు.

మంత్రి పదవి ఆశించలేదు..
తానేమీ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవులను ఆశించలేదని, ఒకవేళ ఆశించి వుంటే, పదవి తీసుకున్న తరువాతనే పార్టీలో చేరుండే వాడినని భూమా నాగిరెడ్డి చెప్పారు. తమ నేతను మంచి పొజిషన్ లో చూడాలని నంద్యాల ప్రాంతంలోని తన కార్యకర్తలు భావిస్తున్నారని చెప్పారు.

అలాంటి ఆలోచనేమీ లేదు..
జగన్‌ను విమర్శించడం ద్వారా చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయాలన్న ఆలోచనేమీ లేదని స్పష్టం చేశారు. తాను వాస్తవాలనే మాట్లాడుతున్నానని భూమా వెల్లడించారు. తెలంగాణలో కూడా పార్టీలు మారుతున్నారని, వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ మారాడని గుర్తు చేశారు.

ఇక పార్టీ మారను...
తాను పార్టీని వీడితే సస్పెండ్ చేసే ధైర్యం కూడా వైసీపీకి లేకపోయిందని విమర్శించారు. ఇకపై తాను మరో పార్టీ మారబోనని, పరిస్థితి అనుకూలం కాదని భావిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

చంద్రబాబు ఇస్తానంటే.. వద్దంటానా!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలిచి మంత్రి పదవిని ఇస్తానంటే తప్పకుండా తీసుకుంటానని, తాను మాత్రం పదవి కోసం పాకులాడబోనని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి వస్తే, కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతలైన శిల్పా సోదరులు, ఏరాసు తదితరులు టీడీపీకి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు నిరాధారమేనని స్పష్టం చేశారు. వారితో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, అందరం కలిసే పార్టీని నడిపించాలన్నది తన అభిమతమని వెల్లడించారు. తన పార్టీ కార్యకర్తలు ఎలా చెబితే అలా వినడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ రాజకీయంగా ఎదగాలన్న కోరిక ఉంటుందని, మంత్రి పదవిపై ఆశలు ఉండటం సహజమేనని భూమా అన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లతో మాట్లాడతా..
‘నేను భూమా నాగిరెడ్డిని మాట్లాడుతున్నా.. (అవతలి నుంచి చెప్పండి అని వినిపించింది) చెప్పండి అంటే ఏంటి? (అవతలి నుంచి 'చెప్పండన్నా... రాంపుల్లారెడ్డి వాళ్లు తీసుకున్నారని చెప్పాను' అని వినిపించింది) అవును... వాళ్లు తీసుకుంటారు. నేను వర్క్ జరగనీయకపోతే? నువ్వేమైనా తిక్కగా మాట్లాడుతున్నావా? వాడు ఆడ వర్క్ చేసుకుంటున్నాడు. ఆడ వర్కే జరగనీయను. నువ్వేం చేస్తావు? రేపు కేసీఆర్, కేటీఆర్ తో మాట్లాడతాను. ('మాట్లాడండి అయితే' అని అవతలి వైపు నుంచి) తెలంగాణలో నాకు పవర్ లేదనుకుంటున్నావా? (పర్లేదు వుంటే మాట్లాడండి తప్పేముంది' అని ఫోన్లో బదులు) నువ్వు రావా ఇక్కడికి? ఆళ్లగడ్డకు రావా?' అంటూ భూమా నాగిరెడ్డి ఓ కాంట్రాక్టరును ఫోన్ లో బెదిరిస్తున్న ఆడియోను ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూ సందర్భంగా వినిపించగా, ఆ గొంతు తనదేనని భూమా అంగీకరించారు.

సంభాషణ మార్చేశారు..
సదరు ఫోన్ కాల్ సంభాషణ వాస్తవమేనని.. అయితే అందులో సంభాషణలు చేర్చారని అన్నారు భూమా. ఇంకా ఏం చెప్పారంటే..
‘ఆ ఫోన్ సంభాషణలో ఏమీ విషయం లేదు. అది మా అపోజిషన్ క్యాండిడేట్ నుంచి వచ్చిన ఫోన్ అని మాకు అర్థమైంది. సో దానికి తగ్గట్టు మేం మాట్లాడాము' అని స్పష్టం చేశారు.

ఆ అడియో ఫేక్.. తెలంగాణ సర్కారు ఊరుకుంటుందా..
అసలా ఆడియో ఫేక్ అని తాను నిరూపించగలనని, వేరే వేరే సందర్భాల మాటలు కలిపారని భూమా ఆరోపించారు. ఇంత సంచలనం సృష్టించే సంభాషణ ఆన్ లైన్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఆడియో మధ్యలో కొన్ని పదాలు కలిపారని ఆరోపించారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ విచారణలో తేలిందని అన్నారు.












Click it and Unblock the Notifications