తిరుపతికి కొత్త సొబగులు- పండగ వాతావరణం
తిరుపతి: తిరుపతి సరికొత్త హంగులను సమకూర్చుకుంటోంది. కొత్త సొబగులను అద్దుకుంటోంది. ఇప్పటికే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. త్వరలో ఇది వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వంతెనను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శ్రీనివాస సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ మంజూరయింది. దీని మొత్తం నిర్మాణ వ్యయం 680 కోట్ల రూపాయలు. ఇదివరకే ట్రయల్ రన్‌ను చేపట్టారు అధికారులు.
మూడవ దశ నిర్మాణ పనులు సైతం ముగిశాయి. టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేశారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్ నుంచి రేణిగుంట రోడ్డు మార్గం ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ నెల 18వ తేదీన వైఎస్ జగన్ తిరుమలను సందర్శించనున్న విషయం తెలిసిందే. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆ రోజున ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అదే రోజున శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను కూడా ప్రారంభించనున్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

అదే సమయంలో డబుల్ డెక్కర బస్సు సైతం తిరుపతి ప్రజలకు అందుబాటులోకి వచ్చిది. ఎలక్ట్రిక్‌తో నడిచే బస్సు ఇది. 18వ తేదీ నాడే వైఎస్ జగన్ ఈ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ఎనిమిది బస్సులను నడిపించాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావిస్తోన్నారు.
ఇవ్వాళ ఈ బస్సు ట్రయల్ రన్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా తిరుపతి నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెడతామని అన్నారు.












Click it and Unblock the Notifications