కిరణ్ రెడ్డి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు: భూమన
హైదరాబాద్/చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీకి ఒక్క సీటు కూడా రాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానానికి పూర్తి స్థాయిలో సహకరించింది కిరణ్ కుమార్ రెడ్డేనని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు కొత్త పార్టీ అంటూ నాటకాలాడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి లేదని, జగన్‌పై నిందలు వేయడం సిగ్గుచేటని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడుకు వెన్నులో వణుకుపుడుతోందని కరుణాకర్ రెడ్డి అన్నారు.

వరుస ఎన్నికలతో ఇబ్బందులే: గాదె
హైదరాబాద్: వరుస ఎన్నికలతో అందరికీ ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్, జిల్లా పరిషత్, అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు వరుసగా నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేంతవరకైనా మున్సిపల్, జిల్లా పరిషత్ ఫలితాలను నిలిపేయాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని గాదె డిమాండ్ చేశారు. ఆ ఫలితాలను వాయిదా వేసేలా చూడాలని అన్నారు. టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని మరో నేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తెలిపారు.












Click it and Unblock the Notifications