తిరుమల లడ్డుపై పీఎం మోదీ వద్ద చంద్రబాబు వ్యాఖ్యల మతలబు ఇదే!
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రధాని మోడీ వద్ద తిరుమల లడ్డూ గురించి మాట్లాడి చంద్రబాబు తన దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూపై మోదీ వద్ద చంద్రబాబు వ్యాఖ్యలపై భగ్గుమన్న భూమన
రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు తిరుపతి లడ్డూ ఇస్తూ..'ఇది కల్తీ లడ్డూ కాదు సార్. ఇది సిసలైన స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది' అని చెప్పినట్టు 'బాబు చమత్కారానికి మోదీగారు విరగబడి నవ్వినట్టు వార్తలు రాశారని పేర్కొని, ఇది చంద్రబాబు దుర్బుద్ధికి నిదర్శనం అన్నారు.

సుప్రీం మాట్లాడొద్దు అన్నా సీఎం ప్రధాని వద్ద ఎలా మాట్లాడుతాడు
లడ్డూ స్వీకరించిన సమయంలో ప్రధాని నవ్విన నవ్వుకు వంద అర్థాలుంటాయన్న భూమన, సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ వివాదంపై మాట్లాడకూడదన్నా, సీఎం ప్రధాని వద్ద ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అసలు నివేదిక రాకుండా, విచారణ జరగకుండానే, చంద్రబాబు ఎలా మాట్లాడతాడు అని నిలదీశారు, ప్రధాని మోదీ కూడా ఆయనను మందలిస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు.
లడ్డూ పై ప్రధాని వద్ద చంద్రబాబు వ్యాఖ్యల మతలబు ఇదే
ప్రధాని ముందు భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా ఆయన వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అదే పనిగా ప్రయత్నించడంలో భాగమే ప్రధాని వద్ద సీఎం వ్యాఖ్యాలని అభిప్రాయం వ్యక్తం చేశారు . ఏదేమైనా సిట్ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను కానీ, తన కంటే ముందు ఛైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు సవాల్ విసిరిన భూమన
స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అదేపనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల వైభవంలో
ఎక్కడా తప్పు జరగలేదన్నారు. దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న భూమన చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్‌కు స్పందించాలని కోరారు.ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా ఆయన కుట్ర చేశారని, అందుకే లౌక్యంగా ప్రధానిని వాడుకున్నారని భూమన ఆరోపించారు.
ప్రాణం కాపాడిన పరమాత్ముడితో బాబు పరాచకాలు
స్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు శ్రీవారి లడ్డూపై ఆరోపణలు చేయడం, స్వార్థ రాజకీయం కోసం దాన్ని పదే పదే వాడుకోవడం సమంజసం కాదని భూమన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాణం కాపాడిన పరమాత్ముడితో బాబు పరాచకాలు ఆడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు . లడ్డూ కల్తీ ఆరోపణలు తీవ్రమైన నేరమనీ, హిందూ సమాజంలో దృష్టిలో చంద్రబాబు ఓ నేరస్తుడిగా మిగిలిపోతారని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications