విభజన వివాదం: భద్రాద్రి తర్వాత తెరపైకి మునగాల
నల్లగొండ: రాష్ట్ర విభజన నేపథ్యంలో మునగాల పరగణాపై వివాదం నెలకొంది. ఖమ్మం జిల్లా భద్రాచలంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే మునగాల కూడా తెరపైకి వచ్చింది. మునగాల సీమాంధ్రకు చెందుతుందా, తెలంగాణకు చెందుతుందా అనే విషయంపై వివాదం సాగుతోంది. అయితే, భౌగోళికంగా, చారిత్రికంగా మునగాల పరగణా తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమేనని నిర్ధారిస్తూ నల్లగొండ జిల్లా రెవెన్యూ అధికారులు స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు గత నెల చివరిలోనే ఒక నివేదిక సమర్పించారు.
మునగాల పరగణాలో 11 గ్రామాలు ఉన్నాయి. కోదాడ అసెంబ్లీ, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వీటి వివరాలు ఉన్నాయి. మునగాల పరగణా నల్లగొండ జిల్లాలోని తెలంగాణ గ్రామాల మధ్యలో భౌగోళికంగా కేంద్రీకృతమై ఉంది. ఈ 11 గ్రామాల ప్రజల భాష, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ తెలంగాణ పద్ధతుల్లోనే కొనసాగుతున్నాయని నల్లగొండ జిల్లా రెవెన్యూ అధికారులు సచివాలయ అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.

చారిత్రక అంశాలు ఇలా ఉన్నాయి - మునగాల పరగణా 1262 నుంచి 1326 వరకు కాకతీయుల పాలనలో ఉండేది. ఆ తర్వాత నిజాంపాలన కిందకు వచ్చింది. 1766లో పరగణాను నిజాం నవాబు ఆంగ్లేయులకు ఇచ్చారు. 1948 పోలీస్ యాక్షన్ తర్వాత మునగాల పరగణాను కృష్ణా జిల్లాలో కలిపారు. దీంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సమయంలో మునగాల పరగణా కృష్ణా జిల్లాలోనే ఉంది. అయితే, రవాణా పరంగా భౌగోళికంగా కృష్ణా జిల్లాలో ఏ మాత్రం ఇమిడే పరిస్థితి లేకపోవటం, పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో పరగణాను నల్లగొండ జిల్లాలో కలిపారు.
మునగాల తమ ప్రాంతంలోనిదే అంటూ తెలంగాణవాదులు ఆందోళనలకు దిగుతున్నారు. మునగాల తెలంగాణ ప్రాంతానికి చెందిందని నినదిస్తూ తెలంగాణ విద్యార్థి జెఎసి నాలుగు రోజుల క్రితం పాదయాత్ర ప్రారంచింది. ఆ పాదయాత్ర ఆదివారంనాడు మునగాలలో ముగిసింది.












Click it and Unblock the Notifications