రెండు నెలలు ఆపితే చాలు: తెలంగాణపై లగడపాటి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను ఆరు నెలల పాటు ఆపగలిగామని, మరో రెండు నెలలు ఆపితే చాలునని, ఎన్నికలు వస్తాయని, తాము మరో రెండు నెలలు ఆపగలమని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెసు అధిష్టానంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం బలహీనమైన ప్రభుత్వమని, మైనారిటీ ప్రభుత్వమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
లోకసభలో అవిశ్వాస తీర్మానం రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, స్పీకర్ కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టారని, ఇవాళ చీకటి రోజు అని ఆయన అన్నారు. శీతాకాలం సమావేశాలను కూడా ప్రభుత్వం సక్రమంగా జరపలేకపోయిందని ఆయన అన్నారు.

కావాలనే సభలో ఆటంకాలు కలిగించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వమే సభలో గందరగోళం సృష్టించిదని అన్నారు. రాష్ట్ర శానససభలో విభజన ముసాయిదా బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో శాసనసభలో చర్చ జరపడానికి తగిన సమయం ఉందని ఆయన అన్నారు. సజావుగా శాసనసభా సమావేశాలు నిర్వహించి, ప్రతి శాసనసభ్యుడు అభిప్రాయం చెప్పే విధంగా చూడాలని, ఓటింగ్ కూడా జరపాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
శానససభలో బిల్లుపై చర్చ జరగకుండా సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. అలా చర్చ జరగకుండా చూస్తే శాసనసభ అభిప్రాయం చెప్పినట్లుగానే పరిగణించే అవకాశం ఉందని, ఆలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఆయన అన్నారు. బిల్లు తప్పులతడకగా ఉందని, 371డికి రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు.
ప్రస్తుత స్థితిలో రాష్ట్ర విభజన జరగకుండానే ఎన్నికలు వస్తాయని, వేర్పాటువాద పార్టీలకు ఎన్నికల్లో చుక్కెదురవుతుందని ఆయన అన్నారు. విభజన మంచిది కాదని తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీలు గుర్తించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications