ఇంకా సమైక్యమనటం సరికాదు: కిల్లి, సోనియాతో భేటీ
న్యూఢిల్లీ: కేంద్రం, తమ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనపై ముందుకు వెళ్తున్న సమయంలో ఇంకా ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచుతామని ప్రజలను మభ్యపెట్టడం సరికాదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి గురువారం న్యూఢిల్లీలో అన్నారు. ఆమె ఉదయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫైలిన్ తుఫాను బాధితులను ఆదుకోవాలని తాను సోనియాను కోరినట్లు చెప్పారు. తాము రాజీనామాలు చేయడం వల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారని తాను భావించడం లేదన్నారు. రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పడం సరికాదన్నారు.

మంత్రుల బృందాన్ని(జివోఎం)ను కలిసి తాము సీమాంధ్ర సమస్యలను చెబుతామని, తమ ప్రాంతానికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడుతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ఇంకా ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, రాజీనామాలు పరిష్కారం కాదన్నారు.
తాను సోనియాకు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించానని చెప్పారు. ఫైలిన్ తుఫాను ప్రభావంతోమత్స్యకారులు, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి సమగ్ర పునరావాసం, ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉందని అధినేత్రి దృష్టికి తీసుకు వెళ్లానన్నారు.












Click it and Unblock the Notifications