అనకాపల్లిలో మారుతున్న సమీకరణం - గెలుపుకు అదొక్కటే అడ్డు..!!
ఏపీలో ఎన్నికల పోరు ఉత్కంఠ పెంచుతోంది. మూడు పార్టీల కూటమి అభ్యర్దులు వైసీపీతో తలపడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారుతోంది. బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో అనకాపల్లి స్థానంలో పోటీ ఆసక్తి కరంగా కనిపిస్తోంది. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్దులు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నా..మారుతున్న లెక్కలతో కొత్త టెన్షన్ మొదలైంది. ఇద్దరి గెలుపులోనూ కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
హోరా హోరీ పోరాు
కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం అనకాపల్లి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేశ్ బరిలో ఉన్నారు. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇరువురూ గెలుపు కోసం తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసిన సీఎం రమేష్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఏరి కోరి మార్పించుకున్నారు. ఆర్దికంగా బలవంతుడు కావటం కలిసొచ్చే అంశం. మూడు పార్టీల బలం..సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బూడి ముత్యాల నాయుడు పూర్తిగా సంక్షేమం, పార్టీకి అండగా నిలుస్తున్న సామాజిక వర్గాల పైన భారం మోపారు.

మారుతున్న లెక్కలు
మాడుగుల స్థానంలో ఇంటి పోరు ముత్యాల నాయుడుకు సమస్యగా మారుతోంది. మా నాన్నను ఓడించండి అంటూ ఆయన పెద్ద భార్య కుమారుడు ప్రచారం చేస్తున్నారు. తన సోదరి పోటీ చేస్తున్న మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్దిగా పోటీలో ఉన్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి, నర్సీపట్నం,మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తిలో జనసేన అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. దీంతో..మూడు పార్టీల ఓట్ల బదిలీ ఈ పార్లమెంట్ పరిధిలో కీలకంగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం, బీజేపీ తరపున సీఎం రమేశ్ పోటీలో నిలవడంతో నియోజకవర్గంలో సమీకరణలు మారిపోయాయి.

కలిసొచ్చేదెవరికి
వైసీపీ సిట్టింగ్ ఎంపీ సత్యవతిని కాదని, ఉప ముఖ్యమంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడును పోటీకి దించింది. కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం చేశారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న బూడి ముత్యాల నాయుడు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు ఓట్లు కురిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.తాను ఎంపీగా గెలిస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే, స్థానిక, స్థానికేతర అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ అంశం ఎంత మేర పనిచేస్తుందనేది ఓటింగ్ లో కీలకంగా మారనుంది. దీంతో...ఇక్కడి ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications